భారతీయ అటవీ చట్టం 1927- సవరణలు ఎందుకోసం?
వలస కాలంలోనే మన ప్రభుత్వాలు అడవిని లాభదాయక వనరుగా పరిగణించాయి. 'భారతీయ అటవీ చట్టం-1927' అడవిని స్థిరీకరించి, అటవీ ఉత్పత్తుల రవాణా, కలప, ఇతర ఉత్పత్తులపై పన్ను విధించేందుకు చట్టం రూపొందించింది. రక్షణ, రవాణా, రాబడి ఈ మూడు అంశాలనే శాసన పీఠికలో పేర్కొన్నారు.
గత మార్చిలో అటవీ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, ఫారెస్టు పాలసీ డివిజన్ వారు ఈ చట్టానికి పలు సవరణలు ప్రతిపాదిస్తూ చర్చకు ముసాయిదా విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్.జి.వోలతోనూ, అడవితో సంబంధమున్న వారందరిని పిలిచి ఈ సవరణలపై చర్చించి సూచనలు పంపమని కేంద్రం కోరింది.
*సవరించదలచిన 'పీఠిక' ఏం చెపుతోంది?*
ఉపోద్ఘాతంలో పై మూడు లక్ష్యాలతోపాటు మరికొన్ని జోడించారు. అవి ఏమంటే 1) అడవుల పరిరక్షణ, అటవీ వనరులను క్రమబద్దంగా నిర్వహించటం వాటిని పరిపుష్టి కలిగించటం, 2) పర్యావరణ సమతుల్యతను (స్థిరత్వం) కాపాడటం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి వుంటూ పర్యావరణ వ్యవస్థల సేవలను నిరంతరాయంగా కొనసాగించటం, 3) ప్రజలు ప్రత్యేకంగా అడవిపై ఆధారపడిన ప్రజల సంక్షేమం, 4) జాతీయ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చటం, 5) అటవీ ఆధారిత సాంప్రదాయ జ్ఞానం బలపర్చటం మద్దతు తెలపటం.
పర్యావరణ సమస్యలకు విశ్వవ్యాపిత స్వభావం వుంటుంది. అందుకే దేశంలో అడవులను వాటిలోని జీవావరణాన్ని కాపాడే చట్టాలు వున్నాయి. 'వన్యమృగ సంరక్షణా చట్టం 1972, అటవీ పర్యావరణ పరిరక్షణాచట్టం-1980, విపత్తుల నిర్వహణా చట్టం' లాంటివి ఉన్నాయి.
ఈ చట్టాలను అమలు చేసి అడవిని రక్షించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు. అది చేయకుండా వలస కాలం నాటి చట్టాన్ని సవరణల పేరుతో ఎందుకు ప్రభుత్వం మార్చాలంటుందో అర్థం కాదు. ఈ చట్టాలు పుట్టక ముందే అడవులలో ప్రజలు నివసించేవారు. అడవులను వర్గీకరించేటప్పుడు వారి నివాస ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని 'రక్షిత (ప్రభుత్వ) అడవులు'గా ప్రకటించేవారు. మన దేశానికి ఆక్రమణదారులుగా వచ్చిన బ్రిటీష్ వారు ఆదివాసుల్ని ఆక్రమణదారులన్నారు. నేటి మన పాలకులు అడవిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఆక్రమణదారులంటున్నారు(సెక్షన్-2(41) నిర్వచనాలు). అలాగే సెక్షన్-2(3), సెక్షన్-2(4) లలో నిర్వచించిన 'కమ్యూనిటీ', 'విలేజ్ ఫారెస్టు' ఆశ్చర్యకరంగా, గత చట్టాలు చెప్పిన వాటికి విరుద్ధంగా వున్నాయి. కమ్యూనిటీ అంటే జాతి, మతం, కులం, భాష మరియు సంస్కృతితో సంబంధం లేనిదట! 'విలేజ్ ఫారెస్టు' ప్రభుత్వానిదట! గత చట్టాలలో లేని ఒక కొత్త వర్గీకరణను ఈ సవరణ చట్టం ప్రతిపాదిస్తోంది. అదే 'ఉత్పత్తి అడవులు' సెక్షన్-2 (10), సెక్షన్ 34(సి) (1) చెప్పేదేమంటే దేశంలో అటవీ ఉత్పత్తులను (నాణ్యత, ఉత్పాదకత) పెంచాలంటే ఉత్పత్తిదారులైన కార్పొరేట్ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టాలి.
సెక్షన్ 80(ఎ) ప్రయివేటు అడవులను ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఆధారిత టూరిజం పేరుతో ప్రయివేటు కంపెనీలను ఆహ్వానించటం ఎవరి అభివృద్ధికి?
*ఆదివాసుల హక్కుల హరణ*
*మరో చారిత్రక అన్యాయమే*
గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో అటవీ అభివృద్ధి పేరుతో రకరకాల పథకాలు, కార్యాచరణ ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇవన్నీ ఉదారవాద ఆర్థిక విధానాలతో, విదేశీ అప్పులతో మొదలయ్యాయి. వన సంరక్షణ సమితి (విఎస్‌ఎస్), జాయింట్ ఫారెస్టు మేనేజ్‌మెంట్ కమిటీ (జెఎఫ్‌ఆర్‌సి) లాభాలు పంచి ఆదాయాలు పెంచలేదు. అవినీతికి నిలువెత్తు నిదర్శనాలైన సెక్షన్-28 1(ఎ),(బి),(సి),(ఇ),(ఎఫ్) ప్రకారం వాటిని స్థానిక సంస్థలతో సమాన గుర్తింపు ఇస్తారట. 'పీసా' చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామ సభలను కేవలం సంప్రదిస్తారట. ప్రతిపాదించబడిన సవరణ చట్టం 'పీసా' చట్టాన్ని కాని, 'అటవీ హక్కుల చట్టం-2006'ను గాని గుర్తించినట్లులేదు.
గిరిజన తెగలకు ఇతర అటవీ నివాసులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేస్తూ భారత పార్లమెంట్ చేసిన చట్టం 'అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ)'. ఏమిటా చారిత్రక అన్యాయం? అది గిరిజనుల హక్కులకు సంబంధించింది. వలస చట్టాలు, స్వాతంత్య్రం తర్వాత చట్టాలు. ఉదాహరణకు 1967 ఎ.పి అటవీ చట్టం సెటిల్‌మెంట్ అధికారులను నియమించమని, వారి హక్కులను గుర్తించమని చెప్పాయి. అయినా పాలకులు పట్టించుకోలేదు. పోడు చేసి బతకటం ఒక అటవీ నేరంగా పరిగణించబడి జైలు శిక్షలు, జరిమానాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఎ.పిలో పోడు పునరావాసం పేరుతో సాగుదారుడికి రూ.25 వేలు ఇస్తామని భూమి లాక్కున్నారు. డబ్బులు ఇవ్వలేదు. ఈ స్థితిలో 2006 లో వామపక్షాల మద్దతుతో గెలిచిన యు.పి.ఎ-1 ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పోడు హక్కును గుర్తించి కుటుంబానికి 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వడం గ్రామాలను రెవిన్యూ గ్రామాలుగా గుర్తించటం, ఉమ్మడి హక్కులుగా రోడ్లు, మేపుభూమి, స్మశాన భూములు కేటాయించాలంది. పర్యావరణ పరిరక్షణకు గిరిజనులను అడవుల నుండి నెట్టి వేయరాదని చట్టం చెప్పినా, దీన్ని అమలు చేయలేదు. ఈ సవరణ చట్టం సెక్షన్-10 ఇప్పుడు సెటిల్‌మెంట్ ఆఫీసర్లను నియమించమంటోంది. అంటే ఏమిటి? 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదని ధృవపడుతోంది. ఎఫ్‌ఆర్‌ఎ చట్టంలో లబ్ధిదారుల గుర్తింపు, పట్టాల పంపిణీకి ఎఫ్‌ఆర్‌ఎ కమిటీ ద్వారా జరగాలి. కాని ఈ చట్టం మళ్ళీ ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్లకు అప్పగించటం దేన్ని సూచిస్తుంది? డిపార్టుమెంట్ పెత్తనాన్ని కాదా?
2013 ఎల్‌ఎఆర్‌ఆర్ చట్టం అమలులో వుండగా ఈ పాత చట్టంలో (అంటే 1894 చట్టం) సవరణలు అవసరమా? సెక్షన్ 11(1),(2),(3),(4) ప్రతిపాదిత సవరణలు చాలా అసందర్భంగా వున్నాయి. అటవీ భూములను అటవీయేతర పనులకు (ప్రాజెక్టులు, మైనింగ్ కార్యకలాపాలు) బదిలీ చేయటానికి సంబంధించి 1980 అటవీ పర్యావరణ చట్టం, తదనంతర మార్గదర్శకాలు చాలా నిర్దిష్టంగా వున్నాయి. వాటిని అమలు చేయకుండా పాత చట్టాలకు సవరణలు ఎవరి ప్రయోజనాల కోసం? కార్పొరేట్ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టటానికా ఈ తాపత్రయం?
*ఈ సవరణకు అర్థం ఏంటి?*
ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన ఐదేళ్లలో పోడు సాగు అంతం కావాలట. సెక్షన్ 10(3)(ఎ), సెక్షన్ 20(1)(సి) ప్రకారం పోడు సాగు ఐదేళ్ల తర్వాత యథావిధిగా అటవీ నేరంగా పరిగణిస్తారన్నమాట. ఉన్న చట్టాన్ని అమలు చేసి భూములు ఇవ్వ నిరాకరిస్తున్న ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మరో చారిత్రక అన్యాయానికి సిద్ధపడటం కాదా?
*అటవీ నేరాలు-శిక్షలు*
1927 చట్టంలో అటవీ నేరాలపై కేసులు పెట్టే అధికారం కేవలం ఫారెస్టు-పోలీసు అధికారులకే వుండేది. ఇప్పుడు సవరణ చట్టంలో రెవిన్యూ అధికారికి కూడా సెక్షన్ 52(1) ద్వారా ఈ అధికారం సంక్రమిస్తుంది. కేవలం అనుమానం ప్రాతిపదికగా ఎలాంటి వారెంట్ లేదా నోటీసు లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు. సెక్షన్ 64(1) (ఎ) (బి) (సి), (2) ఆ అధికారం ఇస్తున్నాయి. ఫారెస్టు రేంజరుకే నేరాలు పరిశోధించే అధికారం, సెక్షన్-190 సి.ఆర్.పి.సి ప్రొసీజర్ 1973 వినియోగించే అధికారం సెక్షన్ 64 (బి),(సి) ఇస్తున్నాయి.
అటవీ నేరాలను మైనర్-మేజర్ నేరాలుగా విభజించటం సెక్షన్ 64(4) ద్వారా లభిస్తుంది. అటవీ భూమికి సంబంధించినవి మేజర్ నేరాలుగా పరిగణిస్తారు.
అటవీ హక్కుల చట్టం-2006 సెక్షన్-3, సబ్ సెక్షన్(1) క్లాజు (సి) ప్రకారం తేలిక పాటి అటవీ ఉత్పత్తులు సేకరించు కోవటానికి, కలిగివుండటానికి, రవాణా చేసుకోవటానికి, అమ్ముకోవటానికి ఆదివాసులు, ఇతర అటవీ నివాసులకు హక్కు వుంది. కాని ప్రస్తుత సవరణ చట్టం సెక్షన్ 2(3),(ఎ) ప్రకారం అటవీ ఉత్పత్తులు సేకరించటం, కలిగి వుండటం, రవాణా, అమ్మటం అటవీ నేరాలుగా పరిగణిస్తారు. అంటే ఇప్పటి వరకు గిరిజనులు ఉచితంగా సేకరించిన పలు ఉత్పత్తులు, ఇప్పుడు అటవీ నేరాలవుతాయి. మన విశాఖ ఏజన్సీలో అడ్డాకుల సేకరణ, తునికాకు సేకరణ, కొండ రెడ్లు సేకరించిన తేనె ఎవరైనా కలిగి వుంటే అటవీ నేరమౌతుంది. ఈ సవరణ చట్టం సెక్షన్ 78(1) ప్రకారం 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జుల్మానా విధిస్తారు. ఇది 1927 చట్టంలో ఒక నెల జైలు, రూ.500 జరిమానాగా వుంది.
ఈ చట్టం సెక్షన్ 78(1) (ఎ) ప్రకారం, సెక్షన్ 26లో పేర్కొన్న నేరాలు అంటే తాజాగా పోడు కోసం చెట్లు నరకడం, అడవిలో అగ్ని రాజేయటం, పశువులు మేపటం, చేపలు పట్టడం లాంటి నిషేధిత పనులు చేస్తే మొదటి దఫా శిక్షగా మూడేళ్లు జైలు శిక్ష లేదా రూ.5-50 వేలు జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించవచ్చు. ఇదే నేరాలు రెండోసారి చేస్తే ఒక సంవత్సరం కఠిన జైలు శిక్ష, జరిమానా గరిష్టంగా రూ.2 లక్షల వరకు విధించవచ్చు.
*ప్రయివేటు అడవులకు అనుమతి*
ఈ సవరణ చట్టం సెక్షన్-80, 80(ఎ) ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు, కంపెనీలకు పనికిరాని అటవీ భూములను ఇచ్చి, మేలైన అటవీ ముడి సరుకులు తయారు చేసుకునే అవకాశం ఇస్తారట. ఇవి సంయుక్తంగా కూడా నిర్వహించవచ్చునట. దీని కోసం జాతీయ ఫారెస్టు రీబోర్డు (సెక్షన్ (1), (2), (3), (4)) ఏర్పాటు చేస్తారట. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.
భారతీయ అడవుల చట్టం-1927కి ప్రతిపాదించిన సవరణలు అడవి మీద ఆధారపడి జీవించే ప్రజలకు వ్యతిరేకంగా వున్నాయి. చట్టం పీఠికలో వారి సంక్షేమం కోసం సవరణ చేస్తున్నట్లు చెప్పి, వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేసే సవరణలు ప్రతిపాదించారు. వీటిని పూర్తిగా పున:పరిశీలన చేయాలని, ఉపసంహరించాలని కోరుతూ ఉద్యమించవలసిన తక్షణ కర్తవ్యం మన ముందు వున్నది.
- డా|| మిడియం బాబూరావు (వ్యాసకర్త మాజీ ఎం.పి, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్)