Followers

Thursday, July 25, 2019

పరిహారక అటవీకరణ నిధి చట్టం || Gondwana channel ||


పారిశ్రామిక తదితర అటవీయేతర అవసరాలకు కోల్పోతున్న అడవులను భర్తీ చేయడం పరిహారక అటవీకరణ లక్ష్యం. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిన ‘పరిహారక అటవీకరణ నిధి చట్టం’తో ఈ ప్రక్రియ మరింత బలం సంతరించుకుంది. ఈ చట్టం కింద కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల అటవీశాఖలకు త్వరలోనే రూ.56,000 కోట్లు అందుతాయి. అంటే, ఆదివాసుల భూములు మరిన్ని అన్యాక్రాంతమవుతూ, ఆ భూములపై వివాదాలు మరింత తీవ్రమవుతాయి.

గోండ్ గిరిజనుడు బాబూలాల్ తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఇంతలో కొంతమంది వ్యక్తులు వచ్చి, ఆ పొలానికి సున్నపు రాయితో హద్దులు గీసి, సిమెంట్ స్తంభాలు నాటారు. విస్మయానికి గురైన బాబూలాల్ ఏమిటిదంతా అని అడిగాడు. వారు అతడికి తెలియని భాషలో ఏదో చెప్పారు. ఇది, ఛత్తీస్‌గఢ్ కొరియా జిల్లాలోని థగ్గోన్ గ్రామంలో చోటుచేసుకున్న ఉదంతం. బాబూలాల్‌కు ఎదురైన అనుభవమే ఆ పల్లెలోని మరో -40 కుటుంబాల వారికీ, పొరుగు గ్రామమైన ఛోటెసల్హి వాసులకు కూడా ఎదురయింది. తన పొలానికి వచ్చిన అపరిచిత కూలీలు మొక్కలు నాటబోతున్నామని చెప్పారని పన్నాలాల్ సాయి గుర్తు చేసుకున్నాడు. అసలు విషయాన్ని తెలుసుకోవడానికి బాబూలాల్, పన్నాలాల్ తదితరులు సమష్టిగా ప్రయత్నించినప్పుడు జిల్లా అటవీశాఖాధికారుల ఆదేశాల మేరకే ఆ కూలీలు వారి పొలాలకు హద్దులు ఏర్పాటు చేసారని, ఆ భూములలో మొక్కల పెంపకానికే అదంతా చేశారని తెలిసింది.

‘భూములే మా జీవనాధారం. ప్రభుత్వం వాటిని తీసుకుంటే మేమెలా బతకాలి?’ అని పన్నాలాల్ ప్రశ్నించాడు. అవును, ఆ ఆదివాసులు ఎలా బతకాలి? భారత్‌లో గనుల తవ్వకం, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇత్యాది అటవీయేతర ప్రయోజనాలకు అటవీ భూములను ఉపయోగించుకున్నప్పుడు చట్టం ప్రకారం ‘పరిహారక అటవీకరణ’కు (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్-–సిఏ) పూనుకోవల్సి వుంటుంది. ఎంత విస్తృతిలో అటవీ భూములను ఉపయోగించుకున్నారో అంతే విస్తృతిలో అటవీయేతర భూములలో అడవిని అభివృద్ధిపరచాలి. గతంలో పరిహారక అటవీకరణ కింద అటవీయేతర భూములలో యూకలిప్టస్, నల్లతుమ్మ మొదలైన దేశీయేతర, వాణిజ్యవృక్ష జాతుల మొక్కలను అటవీశాఖ సిబ్బంది పెంచేవారు. ఇటువంటి తోటల పెంపకాన్ని అడవుల అభివృద్ధిలో భాగంగా భారత ప్రభుత్వం పరిగణిస్తోంది. అడవుల విస్తృతిని పెంపొందించడం, వనాలను సంరక్షించడమనే 2015 పారిస్ వాతావరణ మార్పు ఒప్పందంలోని కీలక అంశాలకు అలా నిబద్ధమవుతున్నామని కేంద్రప్రభుత్వం చెబుతోంది.

థగ్గోన్, ఛోటెసల్హి, మరో పధ్నాలుగు గ్రామాలలో పరిహారక అటవీకరణ ప్రాజెక్టు పర్సా కోల్ బ్లాక్‌కు సంబంధించినది. ఆ గనుల తవ్వకానికి గాను నష్టపోతున్న అడవికి ప్రత్యామ్నాయంగా కొరియా జిల్లాలోని 16 గ్రామాలలో, నాలుగువేలకు పైగా ఎకరాలలో చేపట్టనున్న ఈ పరిహారక అటవీకరణ ప్రాజెక్టు వందలాది ఆదివాసీ కుటుంబాల జీవనాధారాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నది. పారిశ్రామిక, ఇతర అటవీయేతర ప్రయోజనాలకుగాను నష్టపోతున్న అడవులను భర్తీ చేయడమే పరిహారక అటవీకరణ లక్ష్యం. ఈ లక్ష్య సామంజస్యాన్ని పలువురు ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిన ‘పరిహారక అటవీకరణ నిధి చట్టం’ (కాంపెన్సెటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్‌–సీఏఎఫ్‌ యాక్ట్)తో ఆ లక్ష్యం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. సిఏఎఫ్ చట్టం అమలుకు అనుసరించవలసిన నియమ నిబంధనలను 2018లో మోదీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ చట్టాన్ని భూ సంస్కరణలకు అనువర్తింపచేయాలని, అటవీ హక్కుల చట్టం (2006) నిర్దేశించిన అటవీ పాలనా సంస్థల వికేంద్రీకరణతో సిఏఎఫ్ అమలును సమన్వయం చేయాలని, పరిహారక అటవీకరణ నిధుల వినియోగానికి సంబంధిత గ్రామ ప్రజల ఆమోదాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆదివాసులు, అటవీహక్కుల పరిరక్షణ సంఘాలు, ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లను మోదీ ప్రభుత్వం తోసిపుచ్చింది.

సిఏఎఫ్ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాల అటవీశాఖలకు త్వరలోనే రూ.56,000 కోట్లను కేంద్రం అందించనున్నది. తమ ప్రాజెక్టులకు అటవీ సంబంధిత అనుమతులు పొందిన పారిశ్రామికవేత్తలు చేసిన చెల్లింపులతో ఈ భారీ మొత్తం సంచితమయింది. పరిహార అటవీకరణకు ఎంపిక చేసుకున్న భూముల ‘నికర ప్రస్తుత విలువ’, ఆ ప్రత్యామ్నాయ భూములలో మొక్కల పెంపకానికి అవసరమయ్యే వ్యయానికి జరిపిన చెల్లింపులవి. ఈ చెల్లింపులు ఏ అంశంలో ఎంత ఉండాలనేదాన్ని అటవీశాఖే నిర్ణయిస్తుంది. సాధారణంగా ఈ విలువ హెక్టారుకు 5 నుంచి 11 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ భారీ మొత్తాల గురించి ఆనందించవలసింది ఏమీ లేదు. ఒక విధంగా ఇది ‘బ్లడ్ మనీ’ (హతుని కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా హంతకుడు చెల్లించే సొమ్ము). అడవులను ఏ మేరకు కోల్పోతున్నదీ ఈ భారీ మొత్తం సూచిస్తున్నది.

సిఏఎఫ్ చట్టం క్షేత్రస్థాయిలో ఘర్షణలకు దారితీసే అవకాశం చాలా ఉంది. అంతేగాక అది సహజ వనరులపై వివిధ సామాజిక వర్గాల, ముఖ్యంగా ఆదివాసీల హక్కులను బలహీనపరుస్తుంది. వారి ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఛత్తీస్‌గఢ్, ఒడిషాలలో మేము జరిపిన అధ్యయనాలలో తేలింది. 2014–-18 సంవత్సరాల మధ్య 1.24 లక్షల హెక్టార్ల అడవుల నరికివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. పరిహారక అటవీకరణకు అంతే వైశాల్యంలో ప్రత్యామ్నాయ భూములను కేటాయించినట్టు అధికార పత్రాలలో పేర్కొన్నారు. పరిహారక అటవీకరణకు అంత విస్తృత స్థాయిలో భూమి అందుబాటులో ఉండటం అసాధ్యం. పెరుగుతోన్న జనాభా అవసరాలకు అనుగుణంగా భూముల లభ్యత లేని దేశం మనది. మరి వేలాది హెక్టార్ల భూమి అటవీశాఖకు ఎక్కడ లభిస్తుంది? పరిహారక అటవీకరణ పేరుతో గ్రామీణ బలహీనవర్గాల, ఆదివాసీల భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తున్నదని అటవీహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పరిహారక అటవీకరణకు అవసరమైన భూ బ్యాంకులను సృష్టించాలని 2017 నవంబర్‌లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భూబ్యాంకులు ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయని ఆదివాసీ రచయిత గ్లాడ్సన్ డంగ్ డంగ్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లో ఉమ్మడి భూములు, అటవీభూములతో సహా 20 లక్షల ఎకరాలను భూ బ్యాంకులలో నమోదు చేశారని ఆయన అన్నారు. తమ జీవనాధారాలుగా ఉన్న భూములు హఠాత్తుగా తమవి కాకుండా పోవడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి. తొలుత అడవుల నరికివేత, ఆ తరువాత పరిహారక అటవీకరణ పేరిట వేలాది ఆదివాసీ కుటుంబాలు రెండుమార్లు నిర్వాసితమయ్యాయి. ఈ శోచనీయ పరిస్థితికి పర్సా కోల్ బ్లాక్ పరిహారక అటవీకరణ ప్రాజెక్టు సరైన ఉదాహరణ.

2019 ఫిబ్రవరిలో పర్సా కోల్ బ్లాక్ మొదటి దశకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ఈ బొగ్గు గనులను రాజస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజస్థాన్ రాజ్య విద్యుత్ నిగమ్‌కు కేటాయించారు. దీని ప్రకారం గనుల తవ్వకానికై 1600 ఎకరాల వైశాల్యంలోని పచ్చని అడవులను నరికివేస్తారు. పరిహారక అటవీకరణకు కొరియా జిల్లాలో నాలుగువేల ఎకరాల భూమిని గుర్తించడంతో, సదరు 16 గ్రామాలలో అటవీకరణకు అవరోధాలు, నిరోధాలు, అభ్యంతరాలు లేవని జిల్లా కలెక్టర్ ధ్రువీకరణపత్రం మేరకే పర్సా కోల్ బ్లాక్ మొదటి దశకు అనుమతి లభించింది. అయితే వాస్తవాలు అధికారిక కథనాలకు విరుద్ధంగా ఉన్నాయి. అధికారులు ఎవ్వరూ తమను పరిహారక అటవీకరణ గురించి సంప్రదించనేలేదని ఆ 16 గ్రామాలలో నేను పర్యటించిన ఎనిమిది గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఆ భూములే తమ జీవనాధారాలు గనుక తాము ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పారు.

అటవీ భూములపై తరతరాలుగా ఆధారపడివున్న సామాజిక సమూహాలకు ముఖ్యంగా ఆదివాసులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దేందుకుగాను దశాబ్దం కిత్రం అటవీహక్కుల చట్టాన్ని (ఎఫ్ఆర్ఏ) తీసుకొచ్చారు. ఆదివాసులకు ఆ భూములపై గల యాజమాన్య హక్కులను గుర్తించడం ఈ చట్టం లక్ష్యం. అయితే ఇది ఆచరణలో విఫలమయిందని ‘కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ -లెర్నింగ్ అండ్ అడ్వొకసీ నెట్‌వర్క్’ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. అటవీభూములపై తమ హక్కులను గుర్తించాలని ఆదివాసులు పెట్టుకున్న దరఖాస్తులలో యాభైశాతాన్ని అధికారులు తిరస్కరించారు. కొత్తగా వచ్చిన సిఏఎఫ్ చట్టంతో అటవీభూములపై ఆదివాసుల హక్కులను గుర్తించడమనేది మరింత ప్రమాదంలో పడింది. పర్సా కోల్ బ్లాక్ భూముల వ్యవహారమే ఇందుకొక ఉదాహరణ.

2016 జూలైలో సిఏఎఫ్‌ను ఆమోదించకముందే దానివల్ల తలెత్తే సమస్యలను ప్రధానమంత్రికి పలు ప్రజా సంఘాలు తెలియజేశాయి. అధికారిక వర్గాలలో కూడా ఆ బిల్లు పట్ల వ్యతిరేకత వ్యక్తమయింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివిధ డాక్యుమెంట్లు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయినప్పటికీ పార్లమెంటు సిఏఎఫ్‌ను ఆమోదించింది. పరిహారక అటవీకరణకు కేటాయించిన భూములపై స్థానిక ప్రజలు తరతరాలుగా తమ జీవనోపాధికి ఆధారపడివున్నారన్న వాస్తవాన్ని అధికారులు ఉపేక్షించడం గర్హనీయం. ఒడిషా కెయోంఝర్ జిల్లాలో దైతారీ గనుల తవ్వకం కోసం, స్థానిక గిరిజనులు పోడు చేసుకుంటున్న 1700 ఎకరాల భూములను పరిహారక అటవీకరణకు కేటాయించారు. ఒడిషాలో వివిధ పరిహారక అటవీకరణ ప్రాజెక్టులకు రూ.6000కోట్లకు పైగా కేటాయించారు. ఇది అటవీశాఖ వార్షిక బడ్జెట్‌కు పదిరెట్లు అధికం. దీన్నిబట్టి పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఎంత విస్తృతస్థాయిలో అడవుల విధ్వంసానికి అనుమతినిచ్చారో విశదమవుతుంది.

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సిఏఎఫ్‌, ఎఫ్ఆర్ఏ భూ వివాదాలను తక్షణమే పరిష్కరించవలసిన అవసరం ఉంది. పరిహారక అటవీకరణకు కేటాయించే భూముల విషయంలో ముందుగా గ్రామ సభ ఆమోదాన్ని పొందాలని, అలాగే నిర్వాసితులకు విధిగా పునరావాసం కల్పించాలన్న కనీస న్యాయసూత్రాలు పూర్తిగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. సిఏఎఫ్ చట్టం అమలుకు కేంద్రంనుంచి రాష్ట్రాలకు త్వరలో భారీ ఎత్తున నిధులు అందనున్నందున పరిహారక అటవీకరణ ప్రాజెక్టులకు మరిన్ని భూములు కేటాయించే అవకాశం చాలా ఉన్నది. ఆదివాసుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా భూములకు డిమాండ్ పెరుగుతుంది; ఆ భూములపై తలెత్తే వివాదాలు మరింత తీవ్రమవుతాయి. సిఏఎఫ్, ఎఫ్ఆర్ఏలు మౌలికంగా భిన్నమైన చట్టాలని ‘ఏక్తా పరిషత్’ జాతీయ కో ఆర్డినేటర్ రమేశ్ శర్మ అంటున్నారు. ‘సిఏఎఫ్ అధికార వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చేది కాగా, ఎఫ్ఆర్ఏ ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చేది. కనుక ఈ రెండు చట్టాల అమలులో ఘర్షణలు అనివార్యం’ అన్నారాయన.

చిత్రాంగద చౌధురి
పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా

https://www.youtube.com/c/gondwanachannel ఇది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చానెల్ ను అందరూ SUBSCRIBE చెయ్యండి.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur