Followers

Saturday, July 27, 2019

కడదశలో కొలాంలు || Gondwana channel ||

కడదశలో కొలాంలు

    అత్యంత ప్రాథమిక  ఆదివాసీ తెగ  అయిన  కొలాంల గురించి తెలిసిన వారు మైదాన ప్రాంతాల్లో చాలా తక్కువ. గోండులే అత్యంత  వెనుకబడిన ఆదివాసీ జాతిగా అందరికీ తెలుసు. అటువంటి గోండులకంటే కూడా చాలా వెనుకబడి, వారి జాతి పేరు కూడా ఇతర ప్రపంచానికి పెద్దగా తెలియని, మనుగడే ప్రశ్నార్థకంగా మారిన మానవ జాతి ఒకటుంది. అదే కొలామ్ తెగ.
     ఇటీవల నార్నూర్ మండలం కొత్తపల్లి కొలాం గూడలో ఒక పెళ్లి విందులో కలుషిత నీరు తాగి 25 మంది అతిసారకు గురై గంటల వ్యవధిలో ముగ్గురు పిల్లలు మరణించారు. పది రోజుల తేడాతో హర్కాపూర్లో గ్రామంలో మరో కొలాం గర్భిణీ రక్తహీనతతో మరణించింది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొలాం గోంధి గ్రామంలో  పోడు కోసం చెట్లు కొట్టారని అధికారులు,శాసనకర్తలు, న్యాయమూర్తులంతా కలిసి 16 కొలాం కుటుంబాలను శరణార్థుల కంటే హీనంగా మార్చిన సందర్భం చూశాం.  ఇవి కొలాంల ధైన్యాన్ని బట్టబయలు చేసిన ఘటనలు.
           తెలంగాణలో కొలాంలు ఉమ్మడి  అదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఉన్నారు. అన్ని ఆదివాసీ జాతుల్లోకెల్లా కొలాంలది దుర్భర స్థితి.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 కి పైగా కొలాం  ఆవాసాలున్నాయి. సగటున అవాసానికి 120 మంది ఉంటారు. ఆవాసాలు ఎక్కువగా అత్యంత లోతట్టు ప్రాంతాల్లో, మిగతా జనావాసాల నుండి విడివడి ఉంటాయి. వారికి గల ఇన్ని ఆవాసాల్లో, మైదాన ప్రాంతాలకి దగ్గరగా గల వాటితో సహా, ఎక్కడా ఒక్క  కొలామేతర  కుటుంభమే కనిపించదు. వారు ఇంకా అంత విడిగా జీవిస్తారు. వారి భాష కూడా ప్రత్యేకం, కొలామీ భాష.   సగటు జీవిత కాలం 35 ఏళ్ళు ఉండటం గగనం. కొత్తపల్లి కొలాం గూడ గ్రామంలోని కొలాంల మీడియన్ ఏజ్ 18 ఏళ్ళు ఉంది. ప్రపంచంలోనే అతి తక్కువ మీడియన్ ఏజ్ తో బ్రతుకీడుస్థున్న నైగెర్ అనే ఆఫ్రికన్ దేశానికి దగ్గరన్నమాట.
      ఏపి, తెలంగాణ లొని చెంచు,తోటి,కొలాం ,కొలావర్, కొండరెడ్డి మొదలగు తెగలను కేంద్ర ప్రభుత్వం 1975 నుండి "ప్రత్యేకించి అంతరించి పోగల ప్రమాదం ఉన్న ఆదిమ తెగ" (పి.వి.టి.జి)లుగా  గుర్తించింది. ఇలా దేశవ్యాప్తం గా గల 705 షెడ్యూల్ద్ తెగల్లోని  75 తెగలను pvtg లుగా గుర్తించారు. వారలా గుర్తించటానికి ఆయా జాతుల జనాభా పెరగకపోవటం లేదా ఏటేటా తగ్గటం, వారు వ్యవసాయ పూర్వ కాలపు జీవన విధానంలో ఉండటం, అక్షరాస్యత అతి తక్కువగా కొనసాగటం ప్రాతిపదికలుగా ఉన్నాయి. వారి  మనుగడకే ముప్పుగా మారిన
ఈ పరిస్థితుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రభుత్వాలు ప్రకటించాయి. నలభై ఏళ్లు దాటాయి. కాలంతో పాటు వచ్చిన మార్పులు తప్ప వారినెవరూ ప్రత్యేకంగా  ఉద్దరించిన దాఖలాలు లేవు.
     పివీటిజి లు ఇటీవలి వరకూ అడవిని మాత్రమే నమ్ముకుని బ్రతికిన తెగలు . అడవి విస్తారంగా ఉన్నంత వరకు వారికి ఆహారానికి,నీటికి, స్వేచ్చ కి కొదవలేదు. కొన్ని దశాబ్దాల క్రితం వారిని ఉన్నఫలంగా అడవి నుండి బయటకు తెచ్చి మైదాన ప్రాంతాల్లో "అభివృద్ధి" చేయాలనుకున్న ఆధునిక మూఢ విశ్వాసుల ప్రయత్నం ఫలించలేదు గానీ  ఆధునికుల "అభివృద్ధి" కి  అడవులన్నీ బలి కాగా ఆదివాసీలు అడవుల్లేని గిరిజనులు గా మారిపోయారు. ఆదివాసులు మైదాన ప్రాంతాలకు రాలేదు గానీ ఈ రోజు వారి చుట్టూ అంతా మైదానమే. ఇప్పుడు వారికి అడవి లేదు. అడవి లేదు కాబట్టి ఆహారం లేదు,నీటి నిల్వలు లేవు,స్వావలంబన లేదు, స్వతంత్ర జీవన విధానం లేదు. ఒకప్పుడు కీకారణ్యాలనబడే వాటిలో నివసించిన ఆదివాసులకు ఈ రోజు వంట చెరుకు కావాలంటే కూడా ప్రయాస పడాల్సిన పరిస్థితి ఉంది. ఆహారానికి ,నీటికీ, ఉపాధికి ప్రభుత్వమో మరొకరి పైననో  ఆదారపడాలి .
         ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో తోటి,కొలాం,కొలావర్ అనే మూడు పివిటిజీ  తెగలున్నాయి. వీరిలో కొలాంలు మెజారిటి. జనాభా 33 వేల పై చిలుకు. తోటి జనాభా మొత్తం 3 వేల లోపే. కొలావర్ లు 17 వేల మంది ఉన్నారు. కొలావర్ లు ప్రధానంగా ఆసిఫా బాద్ జిల్లాలోనే ఉండగా కొలం,థొటీలు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అంతటా విస్తరించి ఉన్నారు.
       కొలాంలు ఇప్పుడిప్పుడే వ్యవసాయానికి అలవాటు పడుతున్నారు. అతి కొద్దిమందికి మాత్రమే రెవెన్యూ పట్టా భూములున్నాయి. మెజారిటీకి అటవీ పట్టా గల  పోడుభూములు  మాత్రమే ఉన్నాయి. దాదాపు ఒక 20 శాతం కుటుంభాలకు ఆ పోడుభూమి కూడా లేదు. ఆటవీ హక్కుల చట్టం వారి అభివ్రుధ్ధికి ఒక  హక్కుగా కాక వారిపై నియంత్రణగా వాడబడుతున్న ఈ సమయం లో ప్రత్యేకించి ఈ  20 శాతం ప్రజల పరిస్థితి అతి దారుణంగా తయారయింది.
   ఇక వ్యవసాయమంతా ఏ మినహాయింపు లేకుండా పూర్తిగా వర్షాధారం. ఆ భూమీ సారవంతమైనది కాదు. అంతా గుట్టలు,బోడులపై ఉన్న ఆ భూమిలో మట్టి కంటే పలుగు రాళ్ళు,మొరం,చవుడే ఎక్కువ. దాంట్లో  అందరూ పత్తినే  పండిస్తున్నారు. అతి తక్కువగానే కందులు,జొన్నలు. మైదాన ప్రాంతాల్లో ఎకరానికి 15 నుండి 20 క్వింటాల పత్తి పండితే కొలాములకు ఎకరానికి 50 కె.జీ లనుండి గరిష్టంగా 3 క్వింటాల దిగుబడి వస్తుంది. అదీ వారి వ్యవసాయ పరిస్థితి. ఇక ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు భీమాలను పోడు పట్టాలున్న వారికి ఇవ్వటం లేదు. ఇవ్వక పోవటం అహేతుకం,అన్యాయం కూడా.
    ఈ ఘనాపాటి  వ్యవసాయం  కాకుండా కొలాం గిరిజనులు చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే కూలీ పనులకు వెళ్లాలన్నా వారితో పని చేయించుకోగలిగే పెద్ద ఆసాములు వారి పరిసరాల్లో ఎవరూ ఉండరు. ఉపాధి హామీ పథకం కూడా నామ మాత్రంగానే అమలవుతోంది. అంతకు మించి నైపుణ్యం కలిగిన ఉపాధీ లేదా ఉద్యోగం చేయగలిగిన  వారు పట్టణాలకు దగ్గరగా ఉన్న కొన్ని గూడాల్లో అతి కొద్ది మంది తప్ప పెద్దగా లేరు.
         కొలాముల్లో 60 ఏళ్లకు పైబడ్డ వారి సంఖ్య బయటి ప్రాంతాల తో పోల్చినపుడు చాలా తక్కువగా ఉంది. కాబట్టి వృధాప్య పింఛన్లు పొందే వారు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇంతకు మించి ఆదాయ మార్గాలు వారికి లేవు.  "చెట్లు లేని అడవుల్లో" తినటానికి ఏమీ దొరకక, వ్యవసాయానికి సాగు నీరు లేక వారు ఆహారానికి పూర్తిగా ప్రభుత్వ చవక ధరల దుకాణం పైననే ఆధారపడి ఉన్నారు. అక్కడ దొరికే రూపాయి కిలో భియ్యమే ప్రతీ కొలాం గూడాల్లోని అన్ని ఆర్థిక స్థాయిల వారికీ జీవనాధారం. అయితే అక్కడ బియ్యం తప్ప మరో పదార్థం ఇవ్వటం లేదని వారు భాదపడుతున్నారు .
           ఆహారం తర్వాత వారికి గల రెండవ  అతి ముఖ్యమైన జీవన్మరణ సమస్య తాగునీరు. ఈ సమస్య నగరీకుల సోకుల కోసం జరిగిన అడవుల నరికివేతతో   అటవీ ప్రాంతాల్లో ఉపరితల, భూగర్భ జలాలు పడిపోవటంతో మొదలయింది. పక్షులు,జంతువుల మాదిరి నీటికొసం అల్లాడుతూ తాగటానికి పనికిరాని నీళ్లను కూడా తాగుతూ నీటి ద్వారా సంక్రమించే రోగాలైన కలరా,అతిసార వ్యాధి, టైఫాయిడ్,కామర్ల భారిన పడి ఆదివాసీలు  అర్థాంతరంగా చనిపోవటం అక్కడ నిత్య దృశ్యం.
 ఈ సమస్య పరిష్కారానికి కొంతమంది నిజాయితీ గల  ప్రభుత్వాధికారులు కొన్ని ప్రయత్నాలు చేశారు గానీ అవి ప్రయోగాల స్థాయిలోనే పని చేశాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం లో భాగంగా గుట్టలు,లోతట్టు ప్రాంతాలకు సైతం పైపు లైన్లు వేశారు. అదిలాబాద్ రూరల్ మండలం లో  కొన్ని గ్రామాలకు నీళ్లు కూడా ఇస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాలకు ఇచ్చినంత తరచుగా మాకివ్వటం లేదని లోతట్టు ప్రాంతాల వారు చెప్తున్నారు.
     ఇక pvtg లు అక్షరాస్యత లో వెనుకబడ్డారని ప్రభుత్వాలు గుర్తించి కూడా ప్రత్యేక ఏర్పాట్లేవీ  చేయక పోవటం గమనార్హం. 90 శాతం కొలాం గూడాలల్లో అంగన్వాడీ ఉపాధ్యాయునుల్లేరు. ప్రాథమిక బడులు 2 నుండి 3 కి.మీ   దూరంలో ఉంటాయి. పిల్లలను స్కూలుకు తరలించే ఏర్పాటేదీ ప్రభుత్వం చేయదు. చచ్చీ చెడి స్వంతంగా ప్రాథమిక విద్య వరకు వెళ్ళగలిగినా ఆపై బడులు  అందుబాటులో ఉండవు,హాస్టల్ లో ఉంటే తప్ప. ఈ పాటి బళ్లలో విద్యా వాలంటీర్ లే పెద్ద సార్లు. మేం అధ్యయనం చేసిన 8 కొలాం గూడాల్లో రెండింటిలో అక్షరాస్యత అక్షరాలా జీరో.
       వైద్య సౌకర్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ANM లు దాదాపు ఎవరూ గూడాల్లోకి వెళ్లటం లేదు. డెలివరీలు ఇంట్లోనే కావటం అక్కడ సర్వ సాధారణం. సగం డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉంటాయి.  ఉన్నవారిలో నిజాయితీ గా పని చేసే వారు తక్కువ. జిల్లా కేంద్రం లోని RIMS బోధనాసుపత్రి పరిస్థితీ కొలాంల జీవితం లాగే ఉంటుంది. ఇక అంతకంటే కింది ఆసుపత్రుల పరిస్థితి చెప్పే పనిలేదు.
     ఈ రోజు ఆదివాసుల సంస్కృతి  చిక్కి శల్యమౌతున్న వారి భాషలో  తప్ప అంతటా కనుమరుగౌతున్నది.  విగ్రహం,గుడి అంటే మొన్నటిదాకా తెలియని మనుషుల మధ్య ఇప్పుడు అన్ని గూడాలల్లో హనుమాన్ విగ్రహాలు వెలిశాయి. హనుమాన్,అయ్యప్పl దీక్షలు ఊపందుకున్నాయి.  మాకిప్పుడు హనుమాన్  మందిర్ కట్టివ్వాలి అని అప్రయత్నంగానే  అంటున్నారు. ఆర్థికంగా మోస్తరుగా ఉన్న గూడాలల్లో భారీ గోపురాలు ఇప్పటికే వెలిశాయి. అనుకరణ జాడ్యంలో పడి ఆర్యేతర నాగరిక సంస్కృతే అడ్రసు లేకుండా పోయింది. పరాయీకరణకు గురైతున్న తమ ప్రత్యేక సంస్కృతి  గురించి ఆదివాసీ సంఘాలేవీ పట్టించుకోకపోవటం ఆశ్చర్యమే.
         ఈ మధ్య అటవీ హక్కుల చట్టం ప్రకారం స్వంత ఇళ్ళూ భూములూ ఉన్నట్టు ప్రభుత్వంచే గుర్థింపబడని వారిని అక్కడి నుండి వెల్లగొట్టాలని సుప్రీమ్ కోర్టు ప్రభుత్వాలకు ఒక ఆదేశం ఇచ్చింది. తాత్కాలికంగా ఈ ఆదేశం తొందరపాటని తన తీర్పుపై తానే స్టే ఇచ్చుకున్నా దేశ అత్యున్నత న్యాయ మూర్తులకే ఇంత ఊగిసలాట ఉంటే ఇక స్థానిక అటవీ అధికారులు,పోలీసుల గురించి చెప్పేదేముంది. ఎప్పుడెప్పుడు ఆదివాసులను వెల్లగొడదామా అని చూస్తున్నారు. ఎక్కడకని వెల్లగొడతారు. తమ మాతృభూమి అయిన అడవిలోనే వారికి ఇళ్ళూ భూములు లేకపోతే మైదాన ప్రాంతాల్లో ఉంటాయా. బుద్ది లేని వారికి చెప్పవచ్చు ,కానీ ఆదివాసులు కూడా తమ లాంటి పౌరులేనని తెలియని పాలకులకు ఎలా చెప్పటం. ఆదివాసీ ప్రాంతాల్లో  ఖనిజ సంపద కైవసానికై ఆదివాసులను క్రమంగా అక్కడ నుండి ఖాళీ చేయిస్తున్నారనే ఆరోపణ నిజమే అయ్యుండాలి.
            ఇలా బహుముఖాలుగా అన్యాయానికి, దాడికి గురౌతూన్న ఆదివాసీలు ప్రత్యేకించి కొలాంల వంటి అత్యత విలువైన ఆదిమ తెగలకు నాగరికులమనుకునే పాలకులు,అధికారులు మరింత అన్యాయం చేయటం క్షమించరాని నేరం. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు,అవకాశాలు ఆదివాసులకూ వర్తిస్తాయి. వారి జీవితాల్తో ఆటలాడుకోవటం, అభివృద్దిలో వివక్ష, చిన్నచూపు  ప్రజాస్వామ్య స్పూర్థికి విరుద్దం. ఇప్పటికైనా వారికి గల స్వేచ్చగా,గౌరవప్రదంగా జీవించే హక్కును గౌరవిద్దాం.
      డా.ఎస్.తిరుపతయ్య ,
        మానవ హక్కుల వేదిక.
       (Written on 22.06.2019)
        (27.07.2019 ఆంధ్ర జ్యోతి)

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur