Followers

Tuesday, August 13, 2019

గిరి సీమలో వెలుగుల దివ్య దెవరాజన్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ |Gondwana Channel|

గిరి సీమలో వెలుగుల దివ్య దెవరాజన్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ 

💥ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా... గూడేల్లో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత కనిపిస్తుంది. అధికారులతో తమ బాధలు చెప్పుకోలేని అమాయకత్వం వారిది. వీటన్నింటిని గమనించిన ఓ జిల్లా పాలనాధికారి గిరిసీమలో వెలుగులు నింపేందుకు ఓ సాధారణ మహిళగా వారితో కలిసిపోయారు. ఆదివాసుల ఆడపడుచుగా గుర్తింపు పొంది, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమే ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి దివ్యా దేవరాజన్‌.


💥అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఆదివాసీ, గిరిజన జనాభా ఎక్కువ. వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు ఆ జిల్లా కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌. స్థానిక సమస్యల గురించి తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎవరూ స్పందించకపోవడం గమనించారామె. వారికి దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆదివాసీల గోండి భాషను నేర్చుకున్నారు. గ్రామాలకు వెళ్లి వారి భాషలోనే పలకరించడం, అక్కడి సంప్రదాయాలపై ఆసక్తి చూపడంతో క్రమంగా వాళ్ల సమస్యలు తెలిశాయి. ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో ఆమెపై మరింత నమ్మకం పెరిగింది. ఇప్పటి వరకు ఏ అధికారీ ఇంతలా మమేకం కాకపోవడంతో వారంతా ఆ కలెక్టరును తమ ఆడపడుచుగా భావించారు.
సంస్కృతి, సంప్రదాయాలకు విలువ...
దండారి ఉత్సవాలు, ఇతర పండగల్లో పాల్గొంటూ అక్కడి మహిళలకు దగ్గరయ్యారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలకు ప్రధాన కేంద్రమైన నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులతో కలసి పూజల్లో పాల్గొనడంతో పాటు, ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. నాగోబా ఉత్సవాల సందర్భంగా 10 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాదు... గ్రామాల్లో పర్యటిస్తూ రహదారులకు మరమ్మతులూ చేయించారు. శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి లేఖలు పంపడం మొదలుపెట్టారు. క్రమంగా ఎంతో మార్పు తెచ్చారు.


💥ఆదర్శంగా పీహెచ్‌సీలు...
కొండ ప్రాంతాల వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ  పీహెచ్‌సీలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), ఆసుపత్రుల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ఇంద్రవెల్లి, దంతన్‌పల్లి, ఇచ్చోడ మండలాల ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయిలో కాయకల్ప, ఆంక్వా అవార్డులు సాధించాయి.
వ్యవసాయం...
రైతుల సంక్షేమానికి ‘కిసాన్‌ మిత్ర’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఆమె... ఒక టోల్‌ఫ్రీ నెంబరు ఇచ్చి వాళ్లు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదుల్లో 65 శాతం మంది రైతుల సమస్యలను పరిష్కరించారు. ఆత్మహత్యలు చేసుకున్న వ్యవసాయదారుల వివరాలను సేకరించి వారి కుటుంబాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకమైన దళితులకు సాగు భూమి పంపిణీలో ఆదిలాబాద్‌ జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలవడానికి ఈమె చేసిన కృషే కారణం. ప్రతి మండల కేంద్రంలో ‘ప్రజా దర్బార్‌’ కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులు తీసుకొని విడతల వారీగా 80 శాతం రైతులకు రెవెన్యూ హక్కులు కల్పించారు. ఆదివాసీలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికీ కృషి చేశారు. ఉట్నూర్‌ మండలం ధర్మాజీపేట్‌లో 30 కుటుంబాలకు ఉచితంగా పత్తి, జొన్న, పప్పు ధాన్యాల విత్తనాలను సరఫరా చేయించడం తన బాధ్యత అనుకున్నారు.
భిన్న ప్రాంతాల్లో... తమిళనాడుకు చెందిన దివ్యా దేవరాజన్‌ 2010-11 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణి. శిక్షణ అనంతరం 2012లో భువనగిరి సబ్‌కలెక్టరుగా మొదటి పోస్టింగ్‌ రావడంతో అక్కడ రెండేళ్లు, అనంతరం భద్రాచలం ఐటీడీఏ పీవోగా రెండేళ్లు పనిచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 2016 అక్టోబరులో వికారాబాద్‌ జిల్లాకు కలెక్టరుగా వెళ్లారు. రెండేళ్ల క్రితం  ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆదివాసీలు, అక్కడ ఉండే మిగతావారి మధ్య జరిగిన గొడవలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రత్యేక కృషి...
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇప్పపూల పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పపూలతో తినుబండరాలను తయారు చేయించి ఆ మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసులు ఉండటానికి కేవలం నిరక్షరాస్యతే ప్రధాన కారణమని గుర్తించి, అక్షరాస్యతను పెంచేందుకు కార్యక్రమాలు రూపొందించి... విద్యాభివృద్దికీ కృషి చేస్తున్నారామె.


- బండారి లక్ష్మీనర్సయ్య, న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur