Followers

Wednesday, December 27, 2023

గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే దంపతులు

గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే దంపతులు.


   ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, వారి సతీమణి గారు మర్యాదపూర్వకంగా కలిసి  శాలువతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.






విశ్వంలో మనం ఉన్నాం మనలో విశ్వం దాగి ఉంది -వెడ్మ భోజ్జు పటేల్

 మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని అంజి గ్రామంలో పూలజీ బాబా ధ్యాన కేంద్ర 34వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు మాట్లాడుతూ... విశ్వంలో మనం ఉన్నాం - మనలో విశ్వం దాగి ఉంది... అదే ఈశ్వర రూపమని పూలజీ బాబా చెప్పిన ఈ మాటలు అందరికి ఆదర్శమని అన్నారు. ఆ మహనీయుడి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.



Friday, December 15, 2023

తుడుందెబ్బ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక |GONDWANA CHANNEL|

తుడుందెబ్బ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.


   ఈరోజు హన్మకొండ లో జరిగిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం లో యువ నాయకత్వంకి అవకాశం కల్పిస్తూ నూతన రాష్ట్ర కమిటీనీ తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుర్స.పోచయ్య గారు మరియు రాష్ట్ర కమిటీ సీనియర్ నాయకత్వం నిర్ణయం చేయటం జరిగింది 28 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం చరిత్ర లో సీనియర్ నాయకత్వం భవిష్యత్ ఆదివాసీ ఉద్యమ బలోపేతం యువకులకు అవకాశం కల్పించడం అనేది ఒక గొప్ప నిర్ణయం గా భావించాలి.



నూతన రాష్ట్ర కమిటీ 

అధ్యక్షులు : డా" మైపతి.అరుణ్ కుమార్ ( ములుగు), 

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్: గొడం.గణేష్ (అదిలాబాద్),

ప్రధాన కార్యదర్శి: గుర్రాల రవీందర్ (కరీంనగర్),

ఈసం నర్సింహారావు (భద్రాద్రి కొత్తగూడెం),

జడ్కే పాండురంగ ( అదిలాబాద్), 

కొట్నక.విజయ్ ( ఆసిఫాబాద్ ), 

ఉపాధ్యక్షులు : పులుశె బాలకృష్ణ (ములుగు), 

ముక్తి రాజు (భద్రాదికొత్తగూడెం),

కుడిమేత తిరుపతి (మంచిర్యాల),

 పెందురు జలపతి రావు (అదిలాబాద్),

ఊయికే సంజీవ్(అదిలాబాద్),

అట్టం సుభద్ర, ఊకె సుదర్శన్ తాటి రామారావు (ఖమ్మం).



సహాయ కార్యదర్శి: 

ఆలం కిషోర్ (లీగల్ సేల్ సెక్రెటరీ) 

సోయం జంగు(మంచిర్యాల)

సోయం విక్రమ్(జగిత్యాల)  

గోడం రేణుక (అదిలాబాద్)

 కుమ్రా శాంరావు(అదిలాబాద్)

రేగ గణేష్ (జయ శంకర్ భూపాల పల్లి) 



ప్రచార కార్యదర్శి: కొడప నగేష్


కోశాధికారి: ఆడ జంగు


సాంస్కృతిక కార్యదర్శి: ఆగబోయిన రవి( మహబూబ బాద్) 


ప్రధాన సలహాదారులు: సిద్ధబోయిన.లక్ష్మినారాయణ (మహబూబాబాద్) 

కుర్సెంగ సూర్యభాను(అదిలాబాద్).


పోలిట్ బ్యూరో చైర్మన్ : మెస్రం మోతిరం (ఆసిఫాబాద్) 

కో చైర్మన్: పొడెం బాబు(ములుగు)

సభ్యులు: కోడెం వెంకటేశ్వర్లు(భద్రాద్రి కొత్తగూడెం) చంద రఘుపతి(ములుగు) లను ఎన్నిక చేయటం జరిగింది, ఈ జిల్లా కమిటీ ఎన్నికలో రాష్ట్ర కమిటీ బాధ్యులు అన్ని జిల్లాల అధ్యక్ష కార్య దర్శులు మెజార్టీ బై మైనార్టీ తీర్మానం ప్రకారం ఉమ్మడి గా నిర్ణయాలు చేసి కమిటీ నీ ఎన్నిక చేయటం జరిగింది. నూతనంగా ఎన్నిక కాబడిన డా" మైపతి.అరుణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియ చేసారు రాష్ట్ర జిల్లా బాధ్యులు.

Saturday, October 28, 2023

కొలాము వీరరత్న కుమ్రం సూరు |Gondwana Channel|

కొలాము వీరరత్న కుమ్రం సూరు

•••••••••••••••••••••••••••••••••••

భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజులో తెలంగాణ ప్రాంతం నైజాం నవాబుల పాలనలో ఉండేది. జున్ గామా (ఆసిఫాబాద్) జిల్లాలో కొండ, కోన ప్రకృతి సోయగాలతో దట్టమైన అడవిలో సాగుకు యోగ్యం గల అటవీ ప్రాంతమైన మండలం కేరమెరిలో ఆదివాసులు నివాస గూడేలు ఏర్పరచుకొని స్వేచ్ఛగా తమకు అనుకూలంగా ఉన్న భూమిని సాగుచేస్తూ వర్షదార పంటలు జొన్నలు, కొర్రలు, సామాలు, మక్కలు, పచ్చజొన్నలు, గంటె (రాగులు), ఉలువలు, కందులు, పెసర్లు, అనుములు, శనగాలు, ఆముదం, జావూస్ వేసుకొని అడవి ఆధారంగా పశుసంపదను పెంచుకుంటు ప్రకృతిలో దైవత్వాన్ని చూస్తు తమ ఆచార దేవుళ్లును కొలుస్తు తమ సంస్కృతి సంప్రదాయాలతో కొలాములు జీవనం గడుపుతూ ఉండేవారు.



జోడేఘాట్ గ్రామంలో చిన్ను, మారుబాయి దంపతులకు 25.03.1918 సంవత్సరంలో కుమ్రం సూరు జన్మించారు. జోడేఘాట్ అడవి ప్రాంతంలో చిన్ను, మారుబాయి దంపతులు 18 ఎకరాల భూమిని సాగు చేస్తు వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. జున్ గామా (ఆసిఫాబాద్) జిల్లాలో, గొండు, కొలాం, తోటి, పర్థాన్, నాయికపోడ్ మొదలైన గిరిజన తెగలపై కొనసాగుతున్న దౌర్జన్యాలు, భూ ఆక్రమణాలు, అన్యాయాలు, ఆనాటి వ్యాపారులు, పట్వారులు, గ్రామాధి కారులు, ఆదివాసులపై అనేక దౌర్జన్యాలు చేసేవారు.



జంగ్లాత్ (అటవి అధికారులు) భూమిని పంటలతో సహా ఆక్రమించుకునే వాళ్ళు మొత్తం గూడేలను తగులబెట్టె వాళ్ళు వారి మాన ప్రాణలకు రక్షణ ఉండేది కాదు. ఎప్పుడు ఎవ్వరు దాడి చేస్తారో... ఎటువంటి పైశాచిక కృత్యాలకు పాల్పడతారో చెప్పలేని స్థితి. ఇటువంటి దురాగతాల సంఘటనలను చూస్తు చిన్నతనం నుండి ఎదుగుతున్న వయస్సులోనే తన మిత్రులతో గ్రామపెద్దలతో చనువుగా ఉండి తమ కష్ట సుఖాలు పాలు పంచుకుని వారికి ధైర్యానిచ్చి అండగా నిలబడేవాడు.


కుంరం సూరు 19వ యేటా ఆత్రం, మారుబాయిని వివాహం చేసుకున్నాడు. ఈమెకి సంతానం కలుగకపోవడంతో కొన్నాళ్ళకు ఆత్రం, భీంబాయిని వివాహం చేసుకున్నారు.

జోడేఘాట్ లోని 18 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటు జున్ గామా (ఆసిఫాబాద్) జిల్లాలోని పూర్వపు కొలాం గ్రామాలు. బాబేఝరి, పాట్నాపూర్, టోకెన్ మోవాడ్, సమత గుండం, మోవాడ్, సాకన్ గొంది, కుటుద, మలన్ గొంది, యాపల్ పాటి, గోవెనా, పంగిడి, దంతనపల్లి, కౌడన్ మోవాడ్, దాబగూడ, భీమన్ గొంది, కూర్చుగూడ మొదలగు గ్రామాలకు కాలినడక లేదా రేంగి (చిన్నదైన ఎడ్లబండి)తో సందర్శించేవారు. కొలాం దండారి రేలపాటలు, కోలపాటలు, కోలాహాట నృత్యాలు చేయడంలో గుడుం, తపెటా (డప్పు) తుండుం, వాన్స్ (పిల్లనగ్రోవి) మ్రోగించడంలో ప్రావీణ్యులు. గ్రామంలో ఊరి కట్టు కట్టడం, గ్రామదేవత నడిదిమ్మ పూజలు చేయడం పొలకమ్మ ఉత్సవలు సంవత్సరానికి ఒక్కసారి జరుపుతుండేవారు.



సట్టి-పూసి (డిసెంబర్-జనవరి) నెలలో భీమయ్యక్, దసర, బేతల్క్, అడవి రాజులు, ఆయుధపూజలు పూర్వికుల ఆచారాలను కొనసాగించేవారు. అకడి నెల (జులై)లో అకడి రాజుల పూజా పొరనెల (ఆగష్టు) కల్గుల్, కొత్త పండుగ, శివబోడి, చితకి, వానా దేయ్యాళ్ళులను కొలిచేవారు. వివిధ గ్రామాల్లో సూరు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు యువతను సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు కొనసాగించాలని ఆచార్య వ్యవహారాలను పాటిస్తూ తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని సందేశాలు ఇచ్చేవారు. సూరు నిత్యం సంప్రదాయపరంగా రుమ్మల్ ధరించేవారు. ఆ రుమ్మల్లో కొన్ని ఔషద వనమూలికలను నిత్యం తన వెంట ఉంచేవారు. స్వల్ప రోగాలకు సత్వరమే మందులు ఇచ్చేవారు. ఆదివాసి గ్రామాలలో దేవతలకు పూజలు చేసి ఊరి కట్టు మరియు వనమూలికలతో నాటు వైద్యం చేయడం కొలాముల ప్రాచీన విశ్వససంప్రదాయ విద్య కావడం వలన గోండి భాషలో వీరిని పూజారి మరియు దేవరి అని కూడా పిలిచేవారు. తన జాతి ప్రజలు వెనుకబడిన బడుగు బలహీన జీవితాలు గడపడానికి కారణం. ఆనాటి నైజాం నవాబులు వారి తబేదారులు, రాజాకార్లు, కొనసాగిస్తున్న హింసలను ఆక్రమాలను, దౌర్జన్యాలను సహించలేక ఎదురు తిరిగి తన జాతిని నైజాం సంకెళ్ళ నుండి విముక్తి గావించాలని నిర్ణయించుకున్నారు. అధికారులతో చర్చించి కొన్ని చిన్న చిన్న సమస్యలను నేరుగా పరిష్కరించగలిగారు.



నైజాం పాలనతో తీవ్రమైన హింసలను, అత్యాచారాలను ఎదుర్కొంటున్న గిరిజనులను ఐక్యం చేసి ఆదివాసుల హక్కుల సాధన కోసం నిజాం నిరంకుశ పాలనపై పోరాడాలని నిర్ణించి ఆదివాసి ప్రజలను సమీకరించే తరుణంలో జోడఘాట్ కు కుమ్రం భీం, ఎడ్లకొండు రాక ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

కుమ్రం భీం గ్రామమైన సంకెపల్లి, రౌట ఈ రెండు గ్రామాలు ప్రక్క ప్రక్కనే ఉండడం వలన ఎడ్లుకొండు, రౌట, సంకేపల్లికి గ్రామపూజారి గాను భీముకు అత్యంత ప్రాణ స్నేహితుడు, కుమ్రం సూరు, ఎడ్లకొండు కష్ట సుఖాలలో పాలు పంచుకునేవారు. కుమ్రం సూరు, ఎడ్లకొండు, కొలాం గిరిజనులను ఐక్యం చేసి కుమ్రం భీంకు వెన్నుదన్నుగా నిలిచారు. అలా సమకూరిన బలంతో జోడఘాట్ చుట్టు ప్రక్కల 12 గ్రామాలు బాబేఝరి, పాట్నాపూర్, టోకన్ మోవాడ్, బలంపూర్, గుండిగూడ, సుర్దాపూర్, దెమ్మడిగూడ, గోగన్ మోవాడ్, చిర్రన్ మోవాడ్, భీమన్ గొంది, కోపగూడ, మురికి లొంక, వెలిసాయి. ఈ గ్రామాలను ఆనుకొని ఉన్న గిరిజనులు కొన్ని వందల ఎకరాల అటవి భూమిని సాగు చేస్తుండేవారు. వీరు ఎంతో శ్రమపడి పండించిన పంటలను భూములను నైజాం రజాకార్లు ఆక్రమించేవారు.


నైజాం రజాకార్లుకు ఎదురు తిరిగిన గిరిజనులకు చిత్ర హింసలు చేసేవారు. కుమ్రం భీం నాయకత్వంలో తమ భూములకు పట్టాలు సంపాదించాలని కుమ్రం సూరు, కొండు ప్రయత్నించారు. వీరు సాగు చేసిన భూములను దక్కించుకోవడం కోసం ఎన్ని చిత్ర హింసలు చేసిన వీరి గుడిసెలను తగలబెట్టిన భయపడకుండా మమ్ములను మీరు ఏం చేసినా...! మా ప్రాణాలు పోయినా మా భూములను వదిలిపెట్టి వెళ్ళిపోమని కుమ్రం సూరు ఎదిరించారు. కుమ్రం సూరుతో వందలాది కొలాం, గోండు గిరిజనులు ఆసిఫాబాద్ ఆనాటి జిల్లా కలెక్టరు నాజం సాహేబుకు ఆమేరకు ఆర్జీలు పెట్టుకున్నారు.


ఈ విషయం పైన పై అధికారులు స్పందన కరువైంది. నేరుగా నిజాం నవాబును కలుసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించి కుమ్రం భీంతో పాటు కుమ్రం సూరు, ఎడ్లకొండు మరి కొంతమందిని వెంటబెట్టుకొని హైదరాబాద్కు కాలినడకతో బయలుదేరినారు. మార్గ మధ్యలో తమకు తినడానికి జొన్న రొట్టెలు, దంచిన కారం తమ వెంట సామాగ్రితో హైదరాబాద్ కు చేరుకున్నారు.


నైజాం నవాబును కలవాలని ఎంతగా ప్రయత్నించినా అధికారుల యొక్క ద్రుష్పవర్తన వలన వీరికి నైజాం నవాబు దర్శనం కాలేదు. పద్ధతి ప్రకారం తాము సాధించుకోవలసిన పనిని సాధించుకోలేక పోవడం వలన వారిలో ఆగ్రహం పెల్లుబికింది. కొంత మంది గోండు, కొలాం వీరుల సహకారంతో జల్, జంగల్, జమీన్ కోసం విజయమో వీర స్వర్గమా అన్న రీతిగా జోడెఘాట్ కొండలపై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. జోడెఘాట్, బాబేఝరి, పాట్నాపూర్, మోవాడ్, బలంపూరం, గుండి గూడ, సుర్దాపూర్, దెమ్మడి గూడ, చిర్రన్ మోవాడ్, భీమన్ గొంది, మురికిలొంక, ఆదివాసులను సమీకరించి వారికి శిక్షణ ఇచ్చి గిరిజనులపై దౌర్జన్యాలు, అత్యాచారాలను ఆకృత్యాలను పాల్పడిన నైజాం ప్రభుత్వ సైనికులపై తిరుగుబాటు చేశారు. ఆసిఫాబాద్, తహశీల్దార్ 1940 సంవత్సరములో కొందరు సైనికులను వెంటపెట్టుకొని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కుమ్రం సూరును నైజాం. సైనికులు కుమ్రం భీం ఆచూకి తెలియజేయాలని బెదిరించారు.


ఎంత ప్రయత్నించిన భీము యొక్క ఆచూకి వారికి తెలియజేయలేదు. కుమ్రం భీం వరుసకు అన్న అయినప్పటికి అతడు గొండు, నేను కొలాము తెగకు చెందినవాడినని వివరించిన వినకపోవడంతో కుమ్రం సూరు తనకున్న విద్యను ఉపయోగించి తెనెటీగలను సైనికుల పైకి పంపి దాడి చేయించడం వలన నైజాం సైనికులు వెను తిరిగి పారిపోయారు. మడావి కొద్దు, నైజాం సైనికులు ఆశపెట్టిన ప్రతి ఫలానికి లొంగిపోయి వీరు ఉన్న రహస్య స్థావరాన్ని తెలియపరచిన అన్యాయుడు.


కుమ్రం భీం మరియు కుమ్రం సూరు, ఎడ్లకొండు అడవిలో అలజడికి ఆయుదం చేత పట్టి పోరుకు తలపడ్డారు. ఈ పోరాటంలో నైజాం సైనికులు తుపాకులతో కాల్పులు జరుపగా ఆదివాసులు సంప్రదాయ ఆయుదాలు, కొలాలు, ఈటెలు, బరిసెలు, బాణలు, గొడ్డలు, కొడవళ్ళు, దుంగలు, నాటు తుపాకులతో పోరాడినారు. ఈ పోరాటంలో కొలాం తెగకు చెందిన వారు ఆత్రం భీము గ్రామం పంగిడి మం॥ తిర్యాణి, ఎడ్లకొండు గ్రా॥ రౌట సంకెపల్లి, మం॥ ఆసిఫాబాద్, ఆత్రం గంగు, గ్రా॥ జోడేన్ ఘాట్ మం॥ కేరమెరి, ఆత్రం, పొచ్చయ్య, గ్రా॥ పట్నాపూర్, మం॥కేరమేరి, టేకం ముత్తు గ్రా॥ ఇందాపూర్, మం॥ కెరమెరి, ఆత్రం, పావుగా గ్రా॥ జోడెన్ ఘాట్ మం॥ కేరమెరి, టేకం పావుగా గ్రా॥ టోకెన్ మోవాడ్, కొండు, గ్రా॥ దేవదుర్గం మం॥ ఆసిఫాబాద్, ఆత్రం, భీము, గ్రామం కౌడన్ మోవాడ్ మం॥ ఆసిఫాబాద్ వీరితో పాటు మరెందరో ఈ పోరాటంలో అమరులయ్యారు.


నైజాం సైనికుల తుపాకులు సాగించిన నరమేధానికి ఎందరో గిరిజన వీరులు ప్రాణాలర్పించారు. లెక్కలేనన్ని తుటాలు దూసుకుపోవడంతో కుమ్రం భీం, ఎడ్లకొండు నేలకొరిగారు. కుమ్రం సూరు తృటిలో తప్పించుకున్నారు. పెద్ద దిక్కు కనుమరుగైన భావన కుమ్రం సూరులో చోటు చేసుకుంది. ఈ పోరాటంలో కుడి చెయి, కుడి కాలు, నడుము భాగంలో నైజాం సైనికుల తుటాలకు తీవ్రంగా గాయపడి భీతిల్లిన కుమ్రం సూరు, తన ప్రాణాలను కాపాడుకొనుటకు వారి నుండి తప్పించి సముతుల గుండం అడవులలోని ఒక రహస్య సొరంగంలో ఆరు నెలల పాటు అజ్ఞాత వాసం చేశారు. 


ఆ తరువాత కొంతకాలం సముతల గుండం గ్రామంలో నివసిస్తు కొంత భూమిని సాగు చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిపినారు. గిరిజనులకు మరియు అధికారులకు కుం భీం యొక్క జీవిత చరిత్ర వివరించారు.


1975 సంవత్సరంలో ఐటిడిఎలు ఏర్పడిన తరువాత అప్పటి అధికారులతో చర్చించి కుమ్రం భీం వర్థంతి సభను ప్రభుత్వం తరుఫున నిర్వహించే విధంగా కృషి చేసినారు. 1980 సంవత్సరంలో కొలాం గిరిజనుల పిల్లల విద్యా అభివృద్ధి కొరకు కుమ్రం సూరు అప్పటి ప్రాజెక్టు అధికారితో చర్చించి కొలాం గిరిజన గ్రామాలను కలుపుతూ కొలాం ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటుచేయడం జరిగింది.


కొలాం గ్రామ గ్రామన కాలినడకన తిరిగి ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పరిచి కొలాం పిల్లలను బడికి పంపే విధంగా తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడి ఈడు పిల్లలను బడిలో చేర్చి విద్యభ్యసించుటకు  కృషి చేశారు. కుమ్రం సూరు కొలాం ప్రజలకు అంకితభావంతో సేవలు చేయడాన్ని గుర్తించి ఆనాటి ఐటిడిఎ అధికారులు 1986వ సంవత్సరంలో కెవిడబ్ల్యుఓ కొలాం గ్రామాల అధికారిగా ఐటిడిఏ యందు నియమితులయ్యారు. నెలకు 300/- రూపాలయల వేతనం తీసుకుంటూ అనేక సేవలందించి ఆదివాసి గిరిజనుల యొక్క జీవన విధానాన్ని వారి స్థితి గతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినారు.


కుమ్రం సూరు యొక్క సేవాలను ప్రభుత్వం గుర్తించి ఆదివాసి కొలాం క్రాంతి. వీర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. గిరిజనులకు అనేక సేవలందించిన కొలాం వీరరత్న  కుమ్రం సూరు. తేది : 10.08.1997న ఆసిఫాబాద్ మండలంలోని శాకన్ గొంది గ్రామంలో స్వర్గీయులైనారు.


నిస్సహాయులుగా నిస్తేజంతో సతమతమవుతున్న కొలాం గిరిజనుల హృదయాలలో బీజప్రాయంగానైనా సరే స్వాతంత్రేచ్ఛను రగిల్చిన ఖ్యాతి కుమ్రం సూరుకు దక్కింది. అమాయక జీవితాలకు ఒకానొక లక్ష్యం కల్పించి స్వాతంత్ర్య జీవనం గడపడానికి దారి చూపిన ఆదర్శమూర్తి చిరస్మరణీయుడు మా కుమ్రం సూరు.


 

 -ఆత్రం మోతీరామ్ 
 ఫోన్:9398020367.


Friday, September 22, 2023

గల్లీ నుంచి ఢిల్లీ వరకు గర్జించక పోతే |Gondwana Channel|

గల్లీ నుంచి ఢిల్లీ వరకు గర్జించక పోతే...!

మన బ్రతుకులు జంతర్ మంతర్..!!


మన కోసం జరిగే పోరాటంలో మనమే లేకుంటే మన బానిస బ్రతుకులకు మనమే జంతర్ మంతర్.


అందరం ఒక్కటవ్వకపోతే గెలుపు నీడ కూడా మనపై పడనప్పుడు మన ఎడ్డీ పోరాటాలు జంతర్ మంతర్.

హక్కులు పోతున్నా ప్రశ్నించక పోతే,  

చట్టాలు సమాధి అవుతున్నా...చలించక పోతే,

Go లు పోతున్నా...ఎకమవ్వక పోతే,

 మన ఎడ్డీ బ్రతుకులు జంతర్ మంతర్..!



పోరాడుతూ హక్కుల్ని పోగొట్టుకుంటుంటే...

ఉద్యమిస్తూ చట్టాలు పోగొట్టుకుంటుంటే...

చైతన్యం ముసుకులో go లు పోగొట్టు కుంటుంటే...

జీవచ్చవాలై మేధావులు పక్షవాతం తో నరాలు సచ్చి నాలుకలు సచ్చుబడి మూగ జీవాలై...ఐక్యత అన్న ఒక్క పిలుపు కూడా పలుకలేని కుక్కీలో పడి మూలుగుతుంటే, ఆశయాలను నెరవేర్చే, ఐక్యత అడ్రెస్ జంతర్ మంతర్...!!

మనం ఏకమవ్వడమన్నదే జంతర్ మంతర్..!

ఐక్యత లేని ఉద్యమాలు..!!

అంతిమ లక్ష్యాన్ని చేరిన చరిత్రే లేదన్నదే జంతర్ మంతర్..!!




గుడ్డెద్దు చెనులో పడ్డట్లు..

రాజీకి రాని సంఘాలు..

ఉద్యమాలు ఎరుగని విద్యా వంతులు..

ఉలుకు లేని ఉద్యోగులు..

పలుకు లేని ప్రజలు..

మెలుకువ లేని మేధావులు..

తళుక్కున మెరువని విద్యార్థులు ఒక్కటవ్వనంత వరకు

దున్నపోతు మీద తుపాన్ కురిసినట్లే...మన బ్రతుకులు

 జంతర్ మంతర్..!!


జల్ జంగిల్ జమీన్ జంతర్ మంతర్..!!!!!


Friday, July 21, 2023

విశ్వ కోయ - గోండి భాష దినోత్సవం |Gondwana Channel|

 విశ్వ కోయ - గోండి భాష దినోత్సవం 

సందర్భంగా...

     ప్రపంచీకరణలో భాగంగా మొదలైన భాష, సాంస్కృతిక విధ్వంసం ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. దీనితో పలు భాషలు అంతరించిపోతున్నాయి.  వీటిలో కోయ(గోండీ) భాష కూడా ఒకటి. భారత దేశంలో ఆస్ట్రెక్ , ద్రవిడియన్, సినో టిబెటన్ ఇండో యూరోపియన్ నాలుగు భాషా కుటుంబాలు కాగా  రెండవ కుటుంబమైన ద్రవిడియన్ విభాగములో కోయ భాష చెందుతుంది.



   యవ్వ (తల్లి) గర్భం నుంచి పుట్టిన  లిపి లేని కోయ భాషను  బ్రతికించుకోవడానికి చిన్న ప్రయత్నం జరుగుతున్నది. కోయ భాషను మాట్లాడే రాష్ట్రాలు అంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిషా, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కాగా మాండలికాల్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. 




   కోయ  తెగను గోండ్, దొర్ల, మురియా , కుయిగా పిలుస్తారు. నెయ్, ఎడ్జ్, కల్క్, కెల్క్ , ఏర్  మొదలగు పదాలు ఒకే విధంగా ఉచ్చరిస్తారు, ఈ భాషను నాలుగు కోట్ల మంది మాట్లాడుతారు.


☆☆ భాష పరిరక్షణ ఎందుకు..?


      భాష అంటే కేవలం భావ ప్రకటనా మాద్యమమే కాదు. మనిషి అస్తిత్వపు జాడ.  సంస్కృతి, ఆత్మగౌరవ ప్రతీక. అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక సాధనం. మనోభావాలు, హక్కులు రక్షించే వారసత్వ సంపద. అది నిత్యం పారే జీవనది లాంటిది. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీకి ఇది మరింత అపురూపమైనది. దీనిని పదిల పరచి భావి తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.


కోయ నిఘంటువు.


    లిపిలేని కోయ భాషకు వివిధ రాష్ట్రాల అధికారిక భాషలను కలిపి నిఘంటువును తయారు చేసే ప్రక్రియ ప్రారంభమయింది.  దీని కోసం మొదటి వర్క్ షాప్ గాంధీ స్మృతి దర్శన  కల్చరల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో 2014 జులై 21 నుంచి 25 వరకూ, రెండవ వర్క్ షాప్ ఆగస్టు 24 నుండి 29 వరకు కన్నడ యూనివర్సిటీ సహకారంతో హంపిలోనూ, మూడో వర్క్ షాప్ 25 నుండి 29 వరకు 2014 లో మధ్యప్రదేశ్లో అమర్ కంటక్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించడం జరిగింది. 


     నాలుగవ వర్క్ షాప్ డిసెంబర్ 10 నుంచి 15 వరకు 2014 ఉట్నూర్ గిరిజన సమీకృత అభివృద్ధి  సంస్థ సహకారంతోనూ, ఐదవ  వర్క్ షాప్ మార్చ్ 12 నుంచి 16 వరకు 2015 భద్రాచలం గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ సహాయంతోనూ, ఆరవ వర్క్ షాప్ నవంబర్ 21 నుంచి 25 వరకు 2015 చంద్రపూర్ ఆదివాసి శిక్షణ సంస్థ సహాయంతోనూ, ఏడవ  వర్క్ షాప్ జనవరి 9 నుంచి 14 వరకు కన్నడ యూనివర్సిటీ సహకారంతోనూ, ఎనిమిదవ వర్క్ షాప్ ఆగస్టు ఢిల్లీలో 2017 లో జరిగింది. భారత రాజ్యాంగం లోని  ఎనిమిదో షెడ్యూల్  ప్రకారంగా కోయ (గొండి) భాష కు గుర్తింపు కోసం 2017, జులై 21 న  కోర్ కమిటీ   కోయ భాష దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది.


 విశ్వ కోయ -- గోండి భాష దినోత్సవం

 నా ఆదివాసి సమాజానికి ఇవేనా శుభాకాంక్షలు .


 మీ 

కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు),

కన్వీనర్,

జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి,

ఆంధ్ర ప్రదేశ్/ తెలంగాణ.

Tuesday, July 11, 2023

మైపతి అరుణ్ కుమార్ కి డాక్టరేట్ ప్రదానం చేసిన కాకతీయ యూనివర్సిటీ Gondwana Channel

మైపతి అరుణ్ కుమార్ కి డాక్టరేట్ ప్రదానం చేసిన కాకతీయ యూనివర్సిటీ.


6 సంవత్సరాల ఆదివాసి హక్కుల పరిశోధనకు అరుదైన గౌరవం.



     తన తండ్రి ఉపాధ్యాయునిగా కొనసాగింపు, తన తండ్రి అడుగు జాడల్లో విద్యపై మక్కువ ఎక్కువగా పెంచుకొని 10 వ తరగతి వరకు గురుకుల విద్యను పొంది, చిన్న తనం లోనే అమ్మ నాన్న లను కోల్పోయి అనాథగా మారి తన కుటుంబ ఆర్థిక స్థితుల మేరకు తన మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను పూర్తి చేసుకొని, డిగ్రీ SDLC లోని దూర విద్య లో ఎడ్యుకేషన్ లో పూర్తిచేసి యూనివర్సిటీలో పరిచయాలు ఏర్పడి MA(పబ్లిక్ అండ్ పొలిటికల్ సైన్స్) పూర్తి చేసి ఇదే యూనివర్సిటీలో PhD సీటు సాధించటం ఒక విశేషం.



    PhD పరిశోదన విద్య లో దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేకంగా కేటాయించిన రాజ్యాంగ హక్కుల అమలులో 75 ఏళ్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ADMINISYRATION OF TRIBAL DEVELOPMENT IN 5TH AMD 6 TH SCHEDUL AREAS - A CAMPARATIVE STUDY అనే అంశం పై ప్రో" టి.యాదగిరి రావు గారి పర్యవెక్షణలో 6 సంవత్సరాల పాటు ఈశాన్య భారత దేశంలోని మేఘాలయ, అస్సాం, మిజోరాం, మణిపూర్ లలో మధ్య భారత దేశంలోని 18 రాష్ట్రాలలో  క్షేత్ర పరిశోదన చేసి  PhD ని పూర్తిస్థాయిలో ఈరోజుకు పూర్తి చేయటం ఆదివాసి సమాజానికి ఎంతో ఉపయోగకరం. ఆదివాసి సమాజ భవిష్యత్తును అస్తిత్వం నీ ఆదివాసి ఉద్యమంతో పాటు, తన పరిశోధనలో బాగం చేసుకోవటం మైపతి ఉద్యమం పట్ల ఉన్న నిబద్ధతకి నిదర్శనం తెలంగాణ నుండి ఈశాన్య భారత దేశంలోని 6వ షెడ్యూల్ లో  ఆదివాసీల జీవన స్థితి గతులపై, మధ్య భారత దేశం లోని ఆదివాసీల జీవన స్థితిగతులు విద్య వైద్యం, వ్యవసాయం, ఎంప్లాయ్ మెంట్, ఆదివాసి స్వయం పాలన ఐటిడిఏ ల పని తీరు నీ సూక్ష్మంగా అధ్యయనం చేసి తిసేస్ రూపం లో అందించటం జరిగింది.



    విద్యార్థి దశ నుండి ఆదివాసి ప్రాంతాలు, ఆదివాసి విద్యార్థుల సమస్యలు, ఆదివాసీల హక్కులపై క్రమానుగంతంగా అధ్యయనం చేయటం వాటిపై పోరాడుతున్న సంస్థలు, సంఘాలు హక్కుల సంఘాల దళిత, బహుజన పోరాటాలు ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలు ప్రత్యేక ప్రాంత పోరాటాల తో క్రియాశీలకంగా పరిశీలన చేయటం వాటిలో పాల్గొని విశ్లేషించుకుంటూ ప్రమాణగతంగా మాట్లాడటం పద్ధతిగా, క్రమశిక్షణతో నైతికతతో మేల్గటం, పుస్తక పరంతో వ్యక్తిత్వాని  పెంచుకొనటం మంచి మాటకారిగా మంచి రచయితగా  వ్యక్తిత్వాన్ని మలుచుకోవటం జరిగింది. ఆదివాసి సమూహాల జాతుల చారిత్రత్మక అంశాలపై లోతుగా అధ్యయనం చేయటం వాటిని పుస్తకాలలో నిక్షిప్తం చేయటం సమాజానికి తన జాతుల అంశాలను అందివ్వటం వ్యక్తిత్వంగా మార్చుకొనడం జరిగింది. చరిత్ర తెల్సుకొలేనీ వాడు చరిత్ర నిర్మాణం చేయలేడు అన్న డా" బి. ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన ను మైపతి మరువలేదు అందుకే చరిత్ర కోసం నిత్యం పరిశోధనలో ఉంటాడు.


      మహిళా సమస్యలు, వారి హక్కుల జెండర్ ఈక్వేషన్స్, వారి పోరాట సంస్థలు, వారి హక్కుల ఉద్యమాలపై అవగాహన కలిగి ఆదివాసి స్త్రీల సమస్యలు ఆదివాసి సమాజంలో ఆదివాసి స్త్రీల పాత్ర, ఆదివాసి సంస్కృతిలో వారి భాగస్వామ్యం, స్త్రీని ఆదివాసి సమాజం గౌరవాడే తీరును పరిశీలన అధ్యాయనం క్రియాశీలకంగా పాల్గొనటం ఆదివాసి స్త్రీల విద్యను పెంపొందించటం లో కృషి చేయటం తన అలవాటుగా మార్చుకొని కొనసాగడం జరుగుతుంది.


    తెలంగాణ ఉద్యమంలో ఒక యూనివర్సిటీ విద్యార్థిగా క్రియశీలకంగా పాల్గొని బస్సు యాత్రలు, ధర్నాలు రాస్తారోకోలు, రైలు రోకోలు బంద్ లు, బహిరంగ సభలు సకల జనుల ఉద్యమం లో పాల్గొని ASU విద్యార్థి నాయకుడిగా తన జాతి ఆదివాసి విద్యార్థులను మమేకం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనేటట్లు చేయటం జరిగింది.


        తన జాతి ప్రత్యేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొంటూనే సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ అన్ని వర్గాల హక్కులపై సమస్యలపై అవగాహనను పెంచుకొని తన పాత్రను సామాజికంగా పెంపొందించుకోనడం జరిగింది స్వర్గీయ KU నుంచి prof Dr.Biyala.Janardhan Rao గారి స్ఫూర్తితో ASU ఆదివాసి విద్యార్థుల చైతన్యం హక్కుల కోసం కృషి చేసే విధంగా తుడుం దెబ్బ ఉద్యమంలో ఆదివాసీలను చైతన్యపరచటం హక్కుల కోసం పోరాటం చేయడంలో అనేక పదవులను రోహించి తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి ఆదివాసీలకు పాలించుకునే హక్కు కావాలి తమ ప్రాంతం పై తమకే హక్కు ఉండాలనే కాన్సెప్ట్ తో ఉద్యమిస్తున్న ఆశ కిరణం మైపతి అరుణ్ కుమార్.


  దేశవ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాలు పై ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, గత ఆదివాసి పోరాటాలు వర్తమాన ఆదివాసీ పోరాటాలపై స్పష్టమైన అవగాహన ఆదివాసీలపై దేశవ్యాప్తంగా గ్లోబలైజేషన్ ప్రభావాలపై అవగాహన.సరళి కరణ,గ్లోబలికరణ, ప్రపంచీకరణ, కంప్యూటరీకరణ అంశాల ప్రభావాలు ఆదివాసీల ఉనికి మనుగడ, అస్తిత్వం పై వాటి ప్రభావాలు కళ్ళకు కట్టినట్లు వివరించే తత్వం మైపతి అరుణ్ కుమారు ది, ఈ దేశం లో నిజమైన నాగరికత శాస్త్రీయ మూలం ఆదివాసీల ధి అని ఆదివాసి లే ఈ దేశం మూల శాస్త్ర వేత్తలు అని సింధు నాగరికత నుండి నేటి వరకు ఈ దేశానికి బ్రతుకు నీ నేర్పింది ఆదివాసీలు అని బలంగా తన వాని నీ వినిపించే వ్యక్తి ఆదివాసి నీ అనాగరికునిగా సృష్టిస్తే జీర్ణించుకోలేని వ్యక్తి  ఈ తరం ఆదివాసీ మేధావిగా మనం చూడొచ్చునట్లుగా కనిపిస్తాడు. 


  ఎది ఏమైనా ఆదివాసీల శ్వాస ఆదివాసి ఉద్యమ ఆకాంక్ష మైపతి కి ఆదివాసి సమాజం తరుపున డాక్టరేట్ వచ్చిన సందర్భంలో లో ప్రత్యేక అభినందనలు….!!


ఇట్లు

కాకతీయ యూనివర్సటీ జాక్ ( KU JAK) వ్యవస్థపక అధ్యక్షులు

డా " మంద.వీరాస్వామి

సిద్ధబోయిన లక్ష్మినారాయణ 

తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి.

Saturday, July 8, 2023

కుంరం భీం నూతన విగ్రహావిష్కరణ |Gondwana Channel|

కుంరం భీం నూతన విగ్రహావిష్కరణ

   ఆదివాసి పోరాట వీరుడు, అమర జీవి కుమ్రం భీమ్ నుాతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని కుమ్రం భీమ్ చౌక్ నందు తేది: 10/07/2023 సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకి ఘనంగా  నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ వారి కొరెంజన్. 



       కావున సమస్త ఆదివాసి సమాజం తో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొనలని ఉత్సవ కమిటీ సాదర పుార్వకంగా ఆహ్వనిస్తోంది. విగ్రహ ఆవిష్కరణ ముఖ్య కార్యక్రమంకి ముందు డోల్క్, కాళికోం, పెప్రెంగ్ మరియు ఆదివాసి కళా ప్రదర్శనలతో 4 గంటలకి ర్యాలీ ప్రదర్శన మల్టీ పర్పస్ గ్రౌండ్ నుండి కుమ్రంభీమ్ చౌక్ వరకు నిర్వహించడం జరుగుతుందని విగ్రహ ఉత్సవ కమిటీ తెలుపుతున్నాము. ఆదివాసి సమాజ చిన్న, పెద్దలు,  గ్రామ పటేల్, రాయ్ సెంటర్ సభ్యులు, సర్పంచులు, విద్యార్థులు, కుల సంఘాల మరియు రాజకీయ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ మనవి. 

జై కుమ్రం భీమ్ జై జై కుమ్రం భీమ్.!!

Thursday, July 6, 2023

విజయాన్ని అశ్వాదిద్దాం Gondwana Channel

 విజయాన్ని అశ్వాదిద్దాం


మంగపేట గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుందాం....!!!!


మంగ పేట సుదీర్గపోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగినది.



ఆదివాసీల తరుపున వాదనలు వినిపించి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన గౌరవ నీయులు ఆదివాసి పక్షపాతి అడ్వకేట్ చిక్కుడు  ప్రభాకర్ గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియ జెద్దాం..!!

మరియు వారి బృందానికి వారికి సహకరించిన ఆదివాసీ సంఘాలకు, నాయకులకు కూడా ఉద్యమ వందనాలు తెలువుదాం..!


ఈ విజయం ఆషామాసి విజయం కాదు. ఆదివాసీల అస్థిత్వాన్ని కూల్చే కుట్రను 75 ఏండ్లుగా ఎదురొడ్డి పోరాడి సాధించిన విజయం. వివరణకు అక్షరాలు సరిపోవు. గిరిజనేతర కుట్రలకు ఇది గొడ్డలి పెట్టు. ఆదివాసీలు సంబురాలు జరుపుకునే సమరోత్సాహం ఇది..!!


ఎన్నో ఎండ్లుగా మంగపేట మండలంలోని 23 గూడెంల ఆదివాసీల అభివృద్ధి మరణశయనం పై పడకేసింది.

అసలు అభివృద్దే లేదు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఆదివాసీల ఉనికే కనుమరుగై పోయింది.


కనీసం గూడెంకో సర్పంచ్ లేడు, ఎంపీపీ లేడు, జెడ్పీటీసీ లేడు. అసలు 25 ఏండ్లుగా ఎన్నికలే లేవు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకుంది. ఈ దేశంలో మంగపేట ఆదివాసీలు నష్టపోయినంతగా మరెవ్వరూ నష్టపోయి ఉండరూ. ఇది అనుభవించిన స్థానికులకే అర్థమౌతుంది..!



ఒకసారి కోర్టులో గెలుపు మరో సారి మలుపు నమ్మిన లాయర్ లే నట్టేట ముంచిన వైనం అయిన ప్రయత్నం వదలని పోరాటం. కాలం కూడా అలిసిపోయింది. కాసులు కూడా కరిగి పోయాయి. ఆశలు ఆవిరై పోయాయి. ఆలోచనలు రాసులై పోయాయి. కానీ ఉడుం పట్టేదో ఉక్కు పట్టులా నిలిచింది. నిందల్ని మోస్తూనే నిలబడి గెలిచింది. 23 ఆదివాసీ గూడెంలు 5వ షెడ్యూల్ DNA టెస్ట్ లో తమ మూలలను నిరూపించుకున్నాయి. కానీ జరిగిన నష్టం పూడ్చలేనిది..!!


ఈ గెలుపు వెనుక అలువురుగని పోరాట సంఘాలున్నాయి. పట్టు వీడని విక్రమార్కులున్నారు. వారు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు.


నేను మాత్రమే కాదు

మీరు కూడా కృతజ్ఞతలు 

తెలుపండి. ఇది గెలుపు చరిత్ర..!!!!

-Milky Adivasi 

Monday, July 3, 2023

చదువులకు పట్టాలు కావాలి Gondwana Channel

 చదువులకు పట్టాలు కావాలి


గూడెం చదుల్ని పట్టాల పైకి ఎక్కించండి పట్టాలు ఇప్పించండి.


పోడుకు పట్టాలొచ్చాయ్

చదువులకొద్దా...పట్టాలు..!!


గూడెం లో చదువు సచ్చిపోతోంది... ఇది గూడెం వినాశనానికి సంకేతమే.!



ఆదివాసి జాతి అంతం మొదలైంది.

ఆదివాసీల చదువుల పనైపోయింది... పసలేదు

పట్టింపు లేదు.

చదువులకు పట్టాలు లేవు.


పోడుకు పట్టాలొచ్చాయ్

మరి గూడెం పోరగాండ్ల చదువుల పట్టాల సంగతేంది...వద్దా..?

చదువులకు పట్టాలు లేకనే కదా...ఈ కట్టాలు..!

మన గూడెం లో చదువు రాని మోటు గొడ్డలి 10 ఎకరాల భూమికి పట్టా తెచ్చింది.

అన్నీ తెలుసని విర్రవీగిన కలం 20 ఏండ్ల చదువుకు పట్టా  తేలేదు పట్టాభి షేకము లేదు.


ప్రతి గూడెం లో

చదువులకు పట్టాలు కావాలి.

NEET పట్టాలు

IIT పట్టాలు

IAS పట్టాలు

IPS పట్టాలు

ఎంసెట్ పట్టాలు

లాసెట్ పట్టాలు

ఉన్నత చదువులన్నింటికి పట్టాలు కావాలి కదా...

ప్రాణం లేని భూమికేనా పట్టా..

పేగు తెంచుకోని పుట్టిన నీ బిడ్డల చదువులకు పట్టాలు వద్దా.? వాళ్ళను ఉన్నతంగా చదివించడం...పట్టాలు ఇప్పించడం నీ బాధ్యత కాదా...ముమ్మాటికీ నీదే..!!


చైతన్యం సంకనాకుతోంది,

నిర్లక్ష్యం నిలువునా ముంచుతోంది,

అభివృద్ధి ముసుకులో అజ్ఞానం రాజ్యమేలుతోంది.

అహంకారపు అంధకార ముసలం పుట్టింది...ఇది అంతమే...ఖతం...సర్వం హతం...!!

చదువులకు పుట్టగతులు లేవు... ఇగ పుట్టేటోనికి పునాదులు లేవు. కండ్ల ముందున్న రిజర్వేషన్ల ను కావురమెక్కి కాళ్ళతో తన్నుకొని బొక్క బోర్ల పడింది జాతి.

ఎందుకో...తెలుసుకో..!!

తెలుసుకోని నీవు చేసేది కూడా ఏమి లేదు...అయినా తెలుసుకో..!!


ST కోటలో 20 MBBS సీట్లు ఉన్నప్పుడు నలుగురు ఆదివాసీలు డాక్టర్ లు అయ్యారు...ఆ తర్వాత DMHO లు కూడా అయ్యారు..దిగిపోయ్యారు.ఇది 40 ఏండ్ల కిందటి ముచ్చట.ఇంజినీర్లు కూడా గంతే.

నేడు MBBS లో

460+ govt కోటా 

200+ ప్రైవేట్ కోటా

200+ సెంట్రల్ కోటా

   ఇన్నిన్ని సీట్లు ఉన్నప్పుడు ఒక్కరు కూడా డాక్టర్ లు కాలేక పోతున్నారు...IIT/JEE...సివిల్స్...మిగతా కోర్సు ల సంగతి కూడా ఆంతే...ఏమై పోతోంది ఆదివాసీ సమాజం..?

ఎందుకని ఒక్కరు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్ లు కాలేక పోతున్నారు.

ఈ జాతి నిజంగానే ఎడ్డిదై పోయిందా...?

రిజర్వేషన్ శాతం పెరిగింది,

సీట్లు పెరిగాయి,

చైతన్యం పెరిగింది,

సమాచారం పెరిగింది,

సౌకర్యాలు పెరిగాయి.

కానీ

ఆదివాసీల వాటా పెరగలేదు,

కోటా పెరగలేదు,

 కనీసం neet ,ఐఐటీ,సివిల్స్ కు apply కూడా చేసుకోలేని దౌర్భాగ్యపు నిర్లక్ష్యాన్ని పెంచి పోషిస్తున్నదేవరు.? ఈ ఎడ్డీ మా లోకాన్ని బాగుపరిచేది ఎవరు.? ఈ నిర్లక్ష్యం ధోరణిని పెంచుతున్నదేవరు.

Neet, ఐఐటీ,సివిల్స్

ఒక్కసారి రాస్తే...సీట్ వచ్చే కాలం పోయింది.

సీట్ వచ్చే వరకు exam రాసే కాలమొచ్చింది.

కానీ

మనోళ్లు apply కూడా చేసుకోవడం లేదంటే చదువుల చైతన్యం ఎక్కడ సంకనాకి పోతోంది. పోనీ ఉద్యోగులకేమి మాయరోగమొచ్చింది ఉన్నోళ్లకేమి పాడు రోగమొచ్చింది. చేజేతుల తమ పిల్లలు చదువుల్ని తామే చిదిమేస్తున్నారు.

ఈ ఎడ్డీ నిర్లక్ష్యం ఎవ్వరిది.


Bipc గ్రూవు తీసుకోని ఎంసెట్ రాస్తే mbbs సీట్ వచ్చే కాలం పోయి, mpc కూడా గంతే, సివిల్స్ కూడా అంతే

నారాయణ,శ్రీచైతన్య ,ఆకాష్,

allen etc... కాలేజీ లలో చదివి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటేనే సీట్ వచ్చే కాలమొచ్చింది. కాని ఆదివాసీలు చదువులను నిర్లక్ష్యం చేసుకోని పిల్లల గొంతు కొస్తూ, చదువులను చిదిమేస్తున్నారు. ఉన్న టేర్మ్ లను ఉపయోగించు కోవడమే తెలియదు. లాంగ్ టర్మ్ వైపేవ్వడూ చూసిండు. అవకాశం ఉన్నోళ్లు కూడా చదివించడం లేదంటే ఈ ఎడ్డీ చైతన్యం ఎవ్వరిది..?


460 mbbs  సీట్లు

5000 ఐదు వేల ఇంజినీరింగ్ సీట్లు రాష్ట్ర ,దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని యూనివర్సిటీ లలోని వేలాది టెక్నికల్ నాన్ టెక్నికల్ సీట్లు   ఏకపక్షంగా వాళ్లకు పోతుంటే. అవకాశమున్నోళ్లు కూడా తమ పిల్లల్ని చదివించుకోకపోతే ఈ ఎడ్డీ సమాజాన్ని బాగుచేసేది ఎవ్వరూ....?

  అయ్యా ...ఆఖరికి ఉచ్ఛిత neet,సివిల్స్ఐటీబీ కోచింగ్ కు కూడా apply చేసుకోవడం లేదు. పోనీ ప్రతి ITDA పరిధిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే తెలివి లేదు. చదువుల మీద ఆలోచన లేదు. ఇంత అద్వాన్నపు బరి తెగింపు నిర్లక్ష్యంలో మునిగి తేలుతూ తీరుకో జెండా ఎత్తుతారు. రోజుకో పోరాట మంటారు. చదువుకూడా పోరాటమే కదయ్యా కాసేపు పచ్చడి నాకుడు ఆపి ఆలోచించమని అడుగుతోంది గిరిజాబాయి మన గిరిరాజు నాకింది నెమరేసుకుంటూ నీళ్ళు నములుతూ కండ్లు బైర్లు కమ్మి  నెత్తి గోకుకుంటూ నేలవంక...!!చూస్తున్నాడే గాని సమాధానం మాత్రం చెప్పడం లేదు చెప్పడు పెగ్గేసుడు పచ్చడి నాకుడు తప్పా పిల్లల చదువుల మీదా పట్టింపే లేదు సమాధానం రాదు. నౌకరోళ్ళు,పొలిటికలోళ్ళు,పోరాటపోళ్ళు,చదువుకున్నోళ్లు అందరూ పచ్చడి నాకుడుకే సరితూగుతున్నారు. చదువుల పట్టింపు ఎవ్వరికీ లేదు.? ఎవరి కడుపులో పుట్టినా గొప్ప చదువులకు అక్కరకు రాని చెత్తకుప్పల్ని చేజేతులా చేసుకుంటున్నారు పిల్లల్ని..

మీరైనా... చెప్పండి

ఆదివాసీ జాతికి ఏమైంది

ఇంత పిసిని గొట్టు...బరితెగింపు...అద్వాన్నపు...అంధకారపు నిర్లక్ష్యమా...అదీ తమ కడుపులో పుట్టిన పిల్లల చదువుల మీదా...!!

చదువులు లేకుండా

రిజర్వేషన్లు ఉండేమి లాభం

ఈ నిర్లక్ష్యం ఎవ్వరిది....ఓ తండ్రి ఈ నిర్లక్ష్యం...నీదే...ముమ్మాటికీ నీదే...నీవు పచ్చడి నాకుడు ఆపితే...పిల్లల చదువులు సాగుతాయి..!!

అమ్మయ్యా...పూర్తిగా చదివి నందుకు ధన్యవాదాలు

కనీసం...మీ కడుపున పుట్టిన  పిల్లలనైనా... ఉన్నతంగా...చదివించండి..!!

మీ గూడెంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించండి...లేదంటే హతం...ఖతం... భూస్థాపితం..!!

పోరాడి పోడుకు పట్టాలు సాదించినట్లే

పోరాగాండ్ల చదువులకు పట్టాలు ఇచ్చే పోరాటాన్ని భుజానికెత్తుకొండి..!!

గూడెం  చదువుల్ని పట్టాల పైకి ఎక్కించండి..!!

జై సేవా..!!

జై ఆదివాసీ..!!

-Milky Adivasi 

Gondwana Kabur