కొలాము వీరరత్న కుమ్రం సూరు
•••••••••••••••••••••••••••••••••••
భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజులో తెలంగాణ ప్రాంతం నైజాం నవాబుల పాలనలో ఉండేది. జున్ గామా (ఆసిఫాబాద్) జిల్లాలో కొండ, కోన ప్రకృతి సోయగాలతో దట్టమైన అడవిలో సాగుకు యోగ్యం గల అటవీ ప్రాంతమైన మండలం కేరమెరిలో ఆదివాసులు నివాస గూడేలు ఏర్పరచుకొని స్వేచ్ఛగా తమకు అనుకూలంగా ఉన్న భూమిని సాగుచేస్తూ వర్షదార పంటలు జొన్నలు, కొర్రలు, సామాలు, మక్కలు, పచ్చజొన్నలు, గంటె (రాగులు), ఉలువలు, కందులు, పెసర్లు, అనుములు, శనగాలు, ఆముదం, జావూస్ వేసుకొని అడవి ఆధారంగా పశుసంపదను పెంచుకుంటు ప్రకృతిలో దైవత్వాన్ని చూస్తు తమ ఆచార దేవుళ్లును కొలుస్తు తమ సంస్కృతి సంప్రదాయాలతో కొలాములు జీవనం గడుపుతూ ఉండేవారు.
జోడేఘాట్ గ్రామంలో చిన్ను, మారుబాయి దంపతులకు 25.03.1918 సంవత్సరంలో కుమ్రం సూరు జన్మించారు. జోడేఘాట్ అడవి ప్రాంతంలో చిన్ను, మారుబాయి దంపతులు 18 ఎకరాల భూమిని సాగు చేస్తు వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. జున్ గామా (ఆసిఫాబాద్) జిల్లాలో, గొండు, కొలాం, తోటి, పర్థాన్, నాయికపోడ్ మొదలైన గిరిజన తెగలపై కొనసాగుతున్న దౌర్జన్యాలు, భూ ఆక్రమణాలు, అన్యాయాలు, ఆనాటి వ్యాపారులు, పట్వారులు, గ్రామాధి కారులు, ఆదివాసులపై అనేక దౌర్జన్యాలు చేసేవారు.
జంగ్లాత్ (అటవి అధికారులు) భూమిని పంటలతో సహా ఆక్రమించుకునే వాళ్ళు మొత్తం గూడేలను తగులబెట్టె వాళ్ళు వారి మాన ప్రాణలకు రక్షణ ఉండేది కాదు. ఎప్పుడు ఎవ్వరు దాడి చేస్తారో... ఎటువంటి పైశాచిక కృత్యాలకు పాల్పడతారో చెప్పలేని స్థితి. ఇటువంటి దురాగతాల సంఘటనలను చూస్తు చిన్నతనం నుండి ఎదుగుతున్న వయస్సులోనే తన మిత్రులతో గ్రామపెద్దలతో చనువుగా ఉండి తమ కష్ట సుఖాలు పాలు పంచుకుని వారికి ధైర్యానిచ్చి అండగా నిలబడేవాడు.
కుంరం సూరు 19వ యేటా ఆత్రం, మారుబాయిని వివాహం చేసుకున్నాడు. ఈమెకి సంతానం కలుగకపోవడంతో కొన్నాళ్ళకు ఆత్రం, భీంబాయిని వివాహం చేసుకున్నారు.
జోడేఘాట్ లోని 18 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటు జున్ గామా (ఆసిఫాబాద్) జిల్లాలోని పూర్వపు కొలాం గ్రామాలు. బాబేఝరి, పాట్నాపూర్, టోకెన్ మోవాడ్, సమత గుండం, మోవాడ్, సాకన్ గొంది, కుటుద, మలన్ గొంది, యాపల్ పాటి, గోవెనా, పంగిడి, దంతనపల్లి, కౌడన్ మోవాడ్, దాబగూడ, భీమన్ గొంది, కూర్చుగూడ మొదలగు గ్రామాలకు కాలినడక లేదా రేంగి (చిన్నదైన ఎడ్లబండి)తో సందర్శించేవారు. కొలాం దండారి రేలపాటలు, కోలపాటలు, కోలాహాట నృత్యాలు చేయడంలో గుడుం, తపెటా (డప్పు) తుండుం, వాన్స్ (పిల్లనగ్రోవి) మ్రోగించడంలో ప్రావీణ్యులు. గ్రామంలో ఊరి కట్టు కట్టడం, గ్రామదేవత నడిదిమ్మ పూజలు చేయడం పొలకమ్మ ఉత్సవలు సంవత్సరానికి ఒక్కసారి జరుపుతుండేవారు.
సట్టి-పూసి (డిసెంబర్-జనవరి) నెలలో భీమయ్యక్, దసర, బేతల్క్, అడవి రాజులు, ఆయుధపూజలు పూర్వికుల ఆచారాలను కొనసాగించేవారు. అకడి నెల (జులై)లో అకడి రాజుల పూజా పొరనెల (ఆగష్టు) కల్గుల్, కొత్త పండుగ, శివబోడి, చితకి, వానా దేయ్యాళ్ళులను కొలిచేవారు. వివిధ గ్రామాల్లో సూరు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు యువతను సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు కొనసాగించాలని ఆచార్య వ్యవహారాలను పాటిస్తూ తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని సందేశాలు ఇచ్చేవారు. సూరు నిత్యం సంప్రదాయపరంగా రుమ్మల్ ధరించేవారు. ఆ రుమ్మల్లో కొన్ని ఔషద వనమూలికలను నిత్యం తన వెంట ఉంచేవారు. స్వల్ప రోగాలకు సత్వరమే మందులు ఇచ్చేవారు. ఆదివాసి గ్రామాలలో దేవతలకు పూజలు చేసి ఊరి కట్టు మరియు వనమూలికలతో నాటు వైద్యం చేయడం కొలాముల ప్రాచీన విశ్వససంప్రదాయ విద్య కావడం వలన గోండి భాషలో వీరిని పూజారి మరియు దేవరి అని కూడా పిలిచేవారు. తన జాతి ప్రజలు వెనుకబడిన బడుగు బలహీన జీవితాలు గడపడానికి కారణం. ఆనాటి నైజాం నవాబులు వారి తబేదారులు, రాజాకార్లు, కొనసాగిస్తున్న హింసలను ఆక్రమాలను, దౌర్జన్యాలను సహించలేక ఎదురు తిరిగి తన జాతిని నైజాం సంకెళ్ళ నుండి విముక్తి గావించాలని నిర్ణయించుకున్నారు. అధికారులతో చర్చించి కొన్ని చిన్న చిన్న సమస్యలను నేరుగా పరిష్కరించగలిగారు.
నైజాం పాలనతో తీవ్రమైన హింసలను, అత్యాచారాలను ఎదుర్కొంటున్న గిరిజనులను ఐక్యం చేసి ఆదివాసుల హక్కుల సాధన కోసం నిజాం నిరంకుశ పాలనపై పోరాడాలని నిర్ణించి ఆదివాసి ప్రజలను సమీకరించే తరుణంలో జోడఘాట్ కు కుమ్రం భీం, ఎడ్లకొండు రాక ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
కుమ్రం భీం గ్రామమైన సంకెపల్లి, రౌట ఈ రెండు గ్రామాలు ప్రక్క ప్రక్కనే ఉండడం వలన ఎడ్లుకొండు, రౌట, సంకేపల్లికి గ్రామపూజారి గాను భీముకు అత్యంత ప్రాణ స్నేహితుడు, కుమ్రం సూరు, ఎడ్లకొండు కష్ట సుఖాలలో పాలు పంచుకునేవారు. కుమ్రం సూరు, ఎడ్లకొండు, కొలాం గిరిజనులను ఐక్యం చేసి కుమ్రం భీంకు వెన్నుదన్నుగా నిలిచారు. అలా సమకూరిన బలంతో జోడఘాట్ చుట్టు ప్రక్కల 12 గ్రామాలు బాబేఝరి, పాట్నాపూర్, టోకన్ మోవాడ్, బలంపూర్, గుండిగూడ, సుర్దాపూర్, దెమ్మడిగూడ, గోగన్ మోవాడ్, చిర్రన్ మోవాడ్, భీమన్ గొంది, కోపగూడ, మురికి లొంక, వెలిసాయి. ఈ గ్రామాలను ఆనుకొని ఉన్న గిరిజనులు కొన్ని వందల ఎకరాల అటవి భూమిని సాగు చేస్తుండేవారు. వీరు ఎంతో శ్రమపడి పండించిన పంటలను భూములను నైజాం రజాకార్లు ఆక్రమించేవారు.
నైజాం రజాకార్లుకు ఎదురు తిరిగిన గిరిజనులకు చిత్ర హింసలు చేసేవారు. కుమ్రం భీం నాయకత్వంలో తమ భూములకు పట్టాలు సంపాదించాలని కుమ్రం సూరు, కొండు ప్రయత్నించారు. వీరు సాగు చేసిన భూములను దక్కించుకోవడం కోసం ఎన్ని చిత్ర హింసలు చేసిన వీరి గుడిసెలను తగలబెట్టిన భయపడకుండా మమ్ములను మీరు ఏం చేసినా...! మా ప్రాణాలు పోయినా మా భూములను వదిలిపెట్టి వెళ్ళిపోమని కుమ్రం సూరు ఎదిరించారు. కుమ్రం సూరుతో వందలాది కొలాం, గోండు గిరిజనులు ఆసిఫాబాద్ ఆనాటి జిల్లా కలెక్టరు నాజం సాహేబుకు ఆమేరకు ఆర్జీలు పెట్టుకున్నారు.
ఈ విషయం పైన పై అధికారులు స్పందన కరువైంది. నేరుగా నిజాం నవాబును కలుసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించి కుమ్రం భీంతో పాటు కుమ్రం సూరు, ఎడ్లకొండు మరి కొంతమందిని వెంటబెట్టుకొని హైదరాబాద్కు కాలినడకతో బయలుదేరినారు. మార్గ మధ్యలో తమకు తినడానికి జొన్న రొట్టెలు, దంచిన కారం తమ వెంట సామాగ్రితో హైదరాబాద్ కు చేరుకున్నారు.
నైజాం నవాబును కలవాలని ఎంతగా ప్రయత్నించినా అధికారుల యొక్క ద్రుష్పవర్తన వలన వీరికి నైజాం నవాబు దర్శనం కాలేదు. పద్ధతి ప్రకారం తాము సాధించుకోవలసిన పనిని సాధించుకోలేక పోవడం వలన వారిలో ఆగ్రహం పెల్లుబికింది. కొంత మంది గోండు, కొలాం వీరుల సహకారంతో జల్, జంగల్, జమీన్ కోసం విజయమో వీర స్వర్గమా అన్న రీతిగా జోడెఘాట్ కొండలపై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. జోడెఘాట్, బాబేఝరి, పాట్నాపూర్, మోవాడ్, బలంపూరం, గుండి గూడ, సుర్దాపూర్, దెమ్మడి గూడ, చిర్రన్ మోవాడ్, భీమన్ గొంది, మురికిలొంక, ఆదివాసులను సమీకరించి వారికి శిక్షణ ఇచ్చి గిరిజనులపై దౌర్జన్యాలు, అత్యాచారాలను ఆకృత్యాలను పాల్పడిన నైజాం ప్రభుత్వ సైనికులపై తిరుగుబాటు చేశారు. ఆసిఫాబాద్, తహశీల్దార్ 1940 సంవత్సరములో కొందరు సైనికులను వెంటపెట్టుకొని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కుమ్రం సూరును నైజాం. సైనికులు కుమ్రం భీం ఆచూకి తెలియజేయాలని బెదిరించారు.
ఎంత ప్రయత్నించిన భీము యొక్క ఆచూకి వారికి తెలియజేయలేదు. కుమ్రం భీం వరుసకు అన్న అయినప్పటికి అతడు గొండు, నేను కొలాము తెగకు చెందినవాడినని వివరించిన వినకపోవడంతో కుమ్రం సూరు తనకున్న విద్యను ఉపయోగించి తెనెటీగలను సైనికుల పైకి పంపి దాడి చేయించడం వలన నైజాం సైనికులు వెను తిరిగి పారిపోయారు. మడావి కొద్దు, నైజాం సైనికులు ఆశపెట్టిన ప్రతి ఫలానికి లొంగిపోయి వీరు ఉన్న రహస్య స్థావరాన్ని తెలియపరచిన అన్యాయుడు.
కుమ్రం భీం మరియు కుమ్రం సూరు, ఎడ్లకొండు అడవిలో అలజడికి ఆయుదం చేత పట్టి పోరుకు తలపడ్డారు. ఈ పోరాటంలో నైజాం సైనికులు తుపాకులతో కాల్పులు జరుపగా ఆదివాసులు సంప్రదాయ ఆయుదాలు, కొలాలు, ఈటెలు, బరిసెలు, బాణలు, గొడ్డలు, కొడవళ్ళు, దుంగలు, నాటు తుపాకులతో పోరాడినారు. ఈ పోరాటంలో కొలాం తెగకు చెందిన వారు ఆత్రం భీము గ్రామం పంగిడి మం॥ తిర్యాణి, ఎడ్లకొండు గ్రా॥ రౌట సంకెపల్లి, మం॥ ఆసిఫాబాద్, ఆత్రం గంగు, గ్రా॥ జోడేన్ ఘాట్ మం॥ కేరమెరి, ఆత్రం, పొచ్చయ్య, గ్రా॥ పట్నాపూర్, మం॥కేరమేరి, టేకం ముత్తు గ్రా॥ ఇందాపూర్, మం॥ కెరమెరి, ఆత్రం, పావుగా గ్రా॥ జోడెన్ ఘాట్ మం॥ కేరమెరి, టేకం పావుగా గ్రా॥ టోకెన్ మోవాడ్, కొండు, గ్రా॥ దేవదుర్గం మం॥ ఆసిఫాబాద్, ఆత్రం, భీము, గ్రామం కౌడన్ మోవాడ్ మం॥ ఆసిఫాబాద్ వీరితో పాటు మరెందరో ఈ పోరాటంలో అమరులయ్యారు.
నైజాం సైనికుల తుపాకులు సాగించిన నరమేధానికి ఎందరో గిరిజన వీరులు ప్రాణాలర్పించారు. లెక్కలేనన్ని తుటాలు దూసుకుపోవడంతో కుమ్రం భీం, ఎడ్లకొండు నేలకొరిగారు. కుమ్రం సూరు తృటిలో తప్పించుకున్నారు. పెద్ద దిక్కు కనుమరుగైన భావన కుమ్రం సూరులో చోటు చేసుకుంది. ఈ పోరాటంలో కుడి చెయి, కుడి కాలు, నడుము భాగంలో నైజాం సైనికుల తుటాలకు తీవ్రంగా గాయపడి భీతిల్లిన కుమ్రం సూరు, తన ప్రాణాలను కాపాడుకొనుటకు వారి నుండి తప్పించి సముతుల గుండం అడవులలోని ఒక రహస్య సొరంగంలో ఆరు నెలల పాటు అజ్ఞాత వాసం చేశారు.
ఆ తరువాత కొంతకాలం సముతల గుండం గ్రామంలో నివసిస్తు కొంత భూమిని సాగు చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిపినారు. గిరిజనులకు మరియు అధికారులకు కుం భీం యొక్క జీవిత చరిత్ర వివరించారు.
1975 సంవత్సరంలో ఐటిడిఎలు ఏర్పడిన తరువాత అప్పటి అధికారులతో చర్చించి కుమ్రం భీం వర్థంతి సభను ప్రభుత్వం తరుఫున నిర్వహించే విధంగా కృషి చేసినారు. 1980 సంవత్సరంలో కొలాం గిరిజనుల పిల్లల విద్యా అభివృద్ధి కొరకు కుమ్రం సూరు అప్పటి ప్రాజెక్టు అధికారితో చర్చించి కొలాం గిరిజన గ్రామాలను కలుపుతూ కొలాం ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటుచేయడం జరిగింది.
కొలాం గ్రామ గ్రామన కాలినడకన తిరిగి ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పరిచి కొలాం పిల్లలను బడికి పంపే విధంగా తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడి ఈడు పిల్లలను బడిలో చేర్చి విద్యభ్యసించుటకు కృషి చేశారు. కుమ్రం సూరు కొలాం ప్రజలకు అంకితభావంతో సేవలు చేయడాన్ని గుర్తించి ఆనాటి ఐటిడిఎ అధికారులు 1986వ సంవత్సరంలో కెవిడబ్ల్యుఓ కొలాం గ్రామాల అధికారిగా ఐటిడిఏ యందు నియమితులయ్యారు. నెలకు 300/- రూపాలయల వేతనం తీసుకుంటూ అనేక సేవలందించి ఆదివాసి గిరిజనుల యొక్క జీవన విధానాన్ని వారి స్థితి గతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినారు.
కుమ్రం సూరు యొక్క సేవాలను ప్రభుత్వం గుర్తించి ఆదివాసి కొలాం క్రాంతి. వీర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. గిరిజనులకు అనేక సేవలందించిన కొలాం వీరరత్న కుమ్రం సూరు. తేది : 10.08.1997న ఆసిఫాబాద్ మండలంలోని శాకన్ గొంది గ్రామంలో స్వర్గీయులైనారు.
నిస్సహాయులుగా నిస్తేజంతో సతమతమవుతున్న కొలాం గిరిజనుల హృదయాలలో బీజప్రాయంగానైనా సరే స్వాతంత్రేచ్ఛను రగిల్చిన ఖ్యాతి కుమ్రం సూరుకు దక్కింది. అమాయక జీవితాలకు ఒకానొక లక్ష్యం కల్పించి స్వాతంత్ర్య జీవనం గడపడానికి దారి చూపిన ఆదర్శమూర్తి చిరస్మరణీయుడు మా కుమ్రం సూరు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.